![Sonu Sood Praises Tank Bund Swimmer Shiva In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/20/sonu-sood.jpg.webp?itok=liphYWGX)
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించే వారి ప్రాణాలను రక్షిస్తూ.. గుర్తుతెలియని మృతదేహాలను బయటికి తెస్తున్న ‘ట్యాంక్‌బండ్ శివ’ సేవలు అభినందనీయమని సినీ నటుడు సోనూ సూద్ అన్నారు. శివకు వచ్చిన విరాళాలతో పేదలకు సేవ చేసేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయడం, దానికి తన పేరు పెట్టడం ఎంతో సంతోషదాయకమన్నారు. మంగళవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి సోనూసూద్ అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిస్వార్థంగా సమాజానికి సేవలు అందించేందుకు ట్యాంక్‌బండ్ శివ లాంటి వ్యక్తులు ముందుకు రావాలని సూచించారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని నేటి యువత సేవాభావాన్ని పెంపొందించుకోవాలని కోరారు.
ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. పేదలకు శివ తనవంతు సహాయం చేయడానికి ముందుకు రావడం సంతోషకరమన్నారు. శివకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. అనంతరం ట్యాంక్‌బండ్ శివ మాట్లాడుతూ.. దాతలు ఇచ్చిన విరాళాలతో పేదలకు ఆదుకోవాలనే ఉద్దేశంతోనే అంబులెన్స్‌ను కొన్నానని చెప్పారు. కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్న సినీ నటుడు సోనూ సూద్‌ను ఆదర్శంగా తీసుకున్నానని తెలిపారు. దీనికి సోనూసూద్ అంబులెన్స్ అని పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. అంబులెన్స్‌ను స్వయంగా సోనూసూద్ వచ్చి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో విరాళాలు అందించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ యువజన నాయకుడు ముఠా జైసింహ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment