జైలర్‌– 2లో కన్నడ బ్యూటీకి ఛాన్స్‌ | Srinidhi Shetty Will Get Chance In Jailer Movie Sequel | Sakshi
Sakshi News home page

జైలర్‌– 2లో కన్నడ బ్యూటీకి ఛాన్స్‌

Published Sun, Dec 29 2024 7:13 AM | Last Updated on Sun, Dec 29 2024 10:28 AM

Srinidhi Shetty Will Get Chance In Jailer Movie Sequel

నటుడు రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్‌. నెల్సన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.  అంతే కాకుండా అంతకు ముందు అపజయాలను ఎదుర్కొంటున్న రజనీకాంత్‌కు మంచి ఉత్సాహాన్నిచ్చిన చిత్రం జైలర్‌. కాగా దీనికి సీక్వెల్‌ ఉంటుందని దర్శకుడు నెల్సన్‌ చాలా కాలం ముందే వెల్లడించారు. అంతే కాదు చిత్ర కథ సిద్ధం అయ్యిందని, త్వరలోనే సెట్‌పైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు. దీనికి 'హుక్కుమ్'‌ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. 

కాగా తాజాగా జైలర్‌ – 2 చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. నటుడు రజనీకాంత్‌ జైలర్‌– 2 చిత్రానికి సిద్దం అవుతున్నారనీ, ఈ చిత్రానికి సబంధించిన ప్రోమోను ఇటీవలే చిత్రీకరించినట్లు, ఆ ప్రోమోను చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిసింది. ఇకపోతే  జైలర్‌ చిత్రంలో నటించిన మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్‌ తదితర ప్రముఖ  నటీనటులే నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే, 'నువ్వు కావాలయ్యా' పాటతో యువతను గిలిగింతలు పెట్టించిన మిల్క్‌ బ్యూటీ తమన్నా నటిస్తారా..? అనే ఆసక్తి నెలకొంది. కాగా అదనంగా చిత్రంలో కన్నడ భామ శ్రీనిధి శెట్టి నటించనున్నట్లు తెలిసింది. 

కన్నడ చిత్రం కేజీఎఫ్‌లో నాయకిగా నటించిన ఈ అమ్మడు తమిళంలో విక్రమ్‌ హీరోగా నటించిన కోబ్రా చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. ప్రస్తుతం కన్నడలోనే కాకుండా తెలుగులోనూ నటిస్తున్న శ్రీనిధి శెట్టి తాజాగా కోలీవుడ్‌లో లక్కీఛాన్స్‌ వచ్చిందన్నది తాజా సమాచారం. దీంతో మరోసారి జైలర్‌ –2 చిత్రంతో ఈమె తమిళ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. అయితే కోబ్రా చిత్రం నిరాశపరచడంతో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. జైలర్‌– 2 చిత్రంతో తన కంటూ గుర్తింపును తెచ్చుకుంటారేమో చూడాలి.  కాగా ప్రస్తుతం లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్‌ ఈ చిత్రం షూటింగ్‌ను 2025 ఫిబ్రవరి నెలలో పూర్తి చేయనున్నట్లు, తదుపరి మార్చి నెలలో జైలర్‌ 2 చిత్ర షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement