‘శ్రీరంగ నీతులు’ మూవీ రివ్యూ | Sriranga Neethulu Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Sriranga Neethulu Review: ‘శ్రీరంగ నీతులు’ సినిమా ఎలా ఉందంటే..

Published Thu, Apr 11 2024 2:32 PM | Last Updated on Thu, Apr 11 2024 2:47 PM

Sriranga Neethulu Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: శ్రీరంగ నీతులు
నటీనటులుః సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌, కిరణ్‌, రాగ్‌ మయూర్‌, దేవి ప్రసాద్ తదితరులు
నిర్మాణ సంస్థ: రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత: వెంకటేశ్వరరావు బల్మూరి
దర్శకుడు:  ప్రవీణ్‌ కుమార్‌ 
సంగీతం:  హర్షవర్థన్‌ రామేశ్వర్‌, అజయ్‌ అరసాడ
సినిమాటోగ్రఫీ:  టీజో టామీ

శ్రీరంగ నీతులు కథేంటంటే..
ఈ సినిమా కథంతా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. బస్తీకి చెందిన శివ(సుహాస్‌) టీవీ కంపెనీలో జాబ్‌ చేస్తుంటాడు. అతనికి ఫ్లెక్సీల పిచ్చి. బతుకమ్మ సందర్భంగా ఆ ఏరియాలోని గ్రౌండ్‌లో ఎమ్మెల్యేతో కలిసి దిగిన ఫోటోతో ఫ్లెక్సీ కట్టిస్తాడు. అయితే దాన్ని రాత్రికి రాత్రే ఎవరో మాయం చేస్తారు. మరో ప్లెక్సీ కట్టించడానికి డబ్బులు ఉండవు. ఎలాగైన పండక్కి గ్రౌండ్‌లో తన ప్లెక్సీ ఉండాలనుకుంటాడు. దాని కోసం శివ ఏం చేశాడు? చివరకు ఏం జరిగింది?

మరోవైపు వరుణ్‌(విరాజ్‌ అశ్విన్‌), ఐశ్వర్య(రుహానీ శర్మ) ప్రేమించుకుంటారు. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడుతుంది ఐశ్వర్య. పెళ్లి చేసుకుందామని వరుణ్‌ పదే పదే అడగడంతో ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు రెడీ అవుతుంది. ఇంతలోపు ఆమె తండ్రి ఓ పెళ్లి సంబంధం తీసుకొస్తాడు. వారికి అమ్మాయి నచ్చడంతో త్వరలోనే పెళ్లి చేయాలనుకుంటారు. ప్రేమ విషయాన్ని చెప్పలేక, పెద్దలు చూసిన సంబంధం చేసుకోలేక సతమతమవుతారు. దీంతో పాటు ఐశ్వర్యకు మరో సమస్య వస్తుంది. ఆది ఏంటి? చివరకు వరుణ్‌, విరాజ్‌లు పెళ్లి చేసుకున్నారా లేదా? 

ఇంకోవైపు ఉన్నత చదువులు చదివిన కార్తిక్‌(కార్తీక్‌ రత్నం) డ్రగ్స్‌కి అలవాటు పడి జులాయిగా తిరుగుతుంటాడు. ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్నాడని తెలిసి అతన్ని పట్టుకోవడం కోసం పోలీసులు తీరుగుతుంటారు. కొడుకును పోలీసులకు చిక్కకుండా కాపాడుకునే క్రమంలో తండ్రి(దేవీ ప్రసాద్‌) చిక్కుల్లో పడతాడు. చివరకు తండ్రిని కూడా పోలీసులు పట్టుకుంటారు. ఆ తర్వాత  ఏం జరిగింది? కార్తిక్‌ డ్రగ్స్‌కు ఎందుకు బానిసయ్యాడు? చివరకు ఈ ముగ్గురి జీవితాల్లో వచ్చిన మార్పు ఏంటి? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
జీవితంలో ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. అలాంటి వారికి ఒక్క చాన్స్‌ ఇస్తే వారి తప్పులను తెలుసుకొని మారిపోయే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని ‘శ్రీరంగ నీతులు’ సినిమా ద్వారా చెప్పాడు దర్శకుడు ప్రవీణ్‌ కుమార్‌ వీఎస్‌ఎస్‌. అలాగే నేటి యువత చేస్తున్న ప్రధాన తప్పులను మూడు పాత్రల రూపంలో చూపిస్తూ.. చివర్లో మంచి సందేశాన్ని ఇచ్చాడు. పేరు కోసం ఒకరు.. పరువు కోసం మరోకొరు.. ఫెయిల్యూర్‌ని తీసుకోకుండా పెడదారి పట్టేది ఇంకొకరు.. వీరంతా అలా ప్రవర్తించడానికి కారణం సమాజమే. ఇతరులను నిందించడం మానేసి వారికొక అవకాశం ఇస్తే మార్పు వస్తుందని ఈ కథ తెలియజేస్తుంది.

దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బాగుంది కానీ.. తెరపై దాన్ని క్లారిటీగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. ప్రధాన పాత్రల ప్రవర్తన విషయంలో క్లారిటీ మిస్‌ అయింది. శివకి ప్లెక్సీ అంటే ఎందుకంత ఇష్టం?  ఉన్నత చదవులు చదివిన కార్తిక్‌ ఎందుకు డ్రగ్స్‌కి బానిసయ్యాడు? అనేది ఇంకాస్త క్లారిటీగా చూపిస్తే బాగుండేది. ఆ పాత్రల్లో వచ్చిన మార్పుకు గల కారణం కూడా బలంగా లేదు. అయితే ఈ రెండు పాత్రలు వాస్తవికానికి దగ్గరగా ఉంటాయి. ఇప్పటి యువతకి..ముఖ్యంగా ఊరు, బస్తీల్లో ఉండేవారికి ప్లెక్సీల పిచ్చి ఎక్కువగా ఉంటుంది. పండగ వేళల్లో రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలతో హడావుడి చేస్తుంటారు.

ఇదే విషయాన్ని  శివ పాత్ర రూపంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. రుహానీ శర్మ, విరాజ్‌ అశ్విన్‌ల పాత్రల ద్వారా ఈ తరం ప్రేమికులు పడుతున్న ఇబ్బందులను చూపించారు. టాలెంట్‌ ఉన్నా.. సరైన గైడెన్స్‌ లేక, ఫెయిల్యూర్‌ సమయంలో భుజం తట్టి అండగా నిలిచేవారు లేక యువత ఎలా పెడదారిన పడుతున్నారనేది కార్తీక్‌ రత్నం పాత్ర ద్వారా చూపించాడు. అయితే  ఈ మూడు కథల మెసేజ్‌ బాగున్నప్పటికీ కథనం స్లోగా సాగడంతో సాగదీతగా అనిపిస్తుంది. కథలో పెద్దగా మలుపులు, ట్విస్టులు ఉండవు. క్లైమాక్స్‌ కూడా రొటీన్‌గానే ఉంటుంది. 

ఎవరెలా చేశారంటే.. 
ఈ సినిమాలోని ప్రధాన పాత్రలు పోషించినవారంతా సహజ నటనతో ఆకట్టుకున్నారు. బస్తీకి చెందిన శివ పాత్రలో సుహాస్‌ ఒదిగిపోయాడు.  ఇక డ్రగ్స్‌కి బానిసైన కార్తిక్‌గా కార్తిక్‌ రత్నం అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. అతని సంభాషణలు తక్కువే అయినా.. గుర్తిండిపోతాయి. కార్తిక్‌ తండ్రి పాత్రకి దేవి ప్రసాద్‌ న్యాయం చేశాడు. ప్రేమ జంట వరుణ్‌-ఐశ్వరగా విరాజ్‌ అశ్విన్‌, రుహానీ శర్మలు చక్కగా నటించారు.  కిరణ్‌, రాగ్‌ మయూర్‌, తనికెళ్ల భరణితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్యం సంగీతం, సినిమాటోగ్రపీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement