
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. తాజాగా ఈ కేసుపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు. తాజాగా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ మూడేళ్లుగా జరుపుతున్న దర్యాప్తు గురించి స్పందిస్తూ.. 'మొదట్లో ఈ కేసులో వాళ్లూవీళ్లు చెప్పిన సమాచారం మాత్రమే ఉంది. ఆ తర్వాత కొందరు తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. వారి వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పించాలని కోరాము. ప్రాథమిక సాక్ష్యాలను సేకరించాం. వాటి విశ్వసనీయతను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున ప్రస్తుతం ఈ కేసు గురించి ఇంతకంటే ఏం చెప్పలేను' అన్నారు.
కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్‌లో ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించారు. మొదట ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అంతా అనుకున్నారు. కానీ ఇందులో కుట్ర కోణం ఉందని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. మరోవైపు సుశాంత్ చనిపోవడానికి వారం రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment