తమిళసినిమా: కొందరు బాలీవుడ్ హీరోయిన్ల పరిస్థితి ఒడ్డు దాటేవరకు ఓడన్నా, దాటిన తర్వాత బోడన్నా అన్న సామెతలా ఉంది. దక్షిణాది చిత్రాల్లో అవకాశాల కోసం పాకులాడి దర్శక నిర్మాతల ఆసరా, ప్రేక్షకుల ఆదరణతో ఉన్నత స్థాయికి ఎదిగి ఆ తర్వాత అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో, ఇక తమకు అవకాశాలు రావని తెలియడంతో, ఇక ఆచిత్ర పరిశ్రమతో పనిలేదు అన్నట్లుగా ప్రవర్తించడం ఆనవాయితీగా మారింది. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో. ఆమధ్య నటి ఇలియానా, తాప్సి వంటి వారు దక్షిణాది చిత్రాలతో ఎదిగి డబ్బు కూడబెట్టుకుని ఆ తర్వాత ముంబైకి మకాం మార్చి దక్షిణాది చిత్ర పరిశ్రమను కించపరిచేలా విమర్శలు చేసి ఆ తర్వాత నాలుక కరచుకుని అలా అనలేదు అని స్టేట్‌మెంట్స్ ఇచ్చారు.
ఇప్పుడు నటి తమన్నా పరిస్థితి కూడా ఇలానే ఉంది. 18 ఏళ్లు తెలుగు చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ మిల్కీబ్యూటీని దక్షిణాది ప్రేక్షకులు ఇప్పటికీ నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకు కారణం ఇటీవల విడుదలైన జైలర్ చిత్రమే నిజానికి. ఈ చిత్రంలో తమన్నా పెద్దగా నటించిందేమీ లేదు. ఒక్క పాటలో అంగాంగ ప్రదర్శన చేయడం తప్పా. అలాంటిది ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దక్షిణాది చిత్రాల్లో కమర్షియల్ అంశాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని చిత్రాలు అయితే తన పాత్రను కథకు సంబంధం లేకుండానే ఉంటున్నాయని చెప్పారు.
దర్శకులకు ఆ కొరతను సరి చేయమని చెప్పిన ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. అందుకే అలాంటి చిత్రాల్లో నటించడం ఇష్టం లేక తప్పుకున్నానని చెప్పారు. దక్షిణాది భాషా చిత్రాల్లో హీరోలను సహించలేనంతగా ఆదరించేంతగా కథ చిత్రాలను రూపొందిస్తున్నారని అన్నారు. అలాంటి చిత్రాల్లో నటించకుండా ఉండడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే నటించడం అంటే తనకు ఇష్టమని, జయాపజయాల గురించి పెద్దగా పట్టించుకోనని తమన్నా భాటియా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment