మారకపోతే ఆగిపోతాం.. పెళ్లి ప్లాన్‌ ఇప్పటికైతే లేదు: –తమన్నా | Tamannaah Interview About Bhola Shankar and Jailer Movies | Sakshi
Sakshi News home page

మారకపోతే ఆగిపోతాం.. పెళ్లి ప్లాన్‌ ఇప్పటికైతే లేదు: తమన్నా

Published Sat, Aug 5 2023 4:10 AM | Last Updated on Sat, Aug 5 2023 7:00 AM

Tamannaah Interview About Bhola Shankar and Jailer Movies - Sakshi

‘నువ్వు కావాలయ్య...’ అంటూ ‘జైలర్‌’లో హుషారుగా స్టెప్పులేశారు తమన్నా. ఈ బ్యూటీ కూడా సినిమా ఇండస్ట్రీకి మోస్ట్‌ వాంటెడ్‌. అందుకే దాదాపు 20 ఏళ్లయినా ఇంకా ఫుల్‌ బిజీగా ఉన్నారు. తమిళంలో ‘అరణ్‌మణై’, మలయాళంలో తొలి చిత్రం ‘బాంద్రా’, ఓ టీవీ షోతో బిజీగా ఉన్నారామె. చిరంజీవి సరసన తమన్నా నటించిన ‘భోళా శంకర్‌’ ఈ 11న విడుదల కానుంది. అంతకు ఒక్కరోజు ముందు రజనీకాంత్‌  ‘జైలర్‌’తో థియేటర్లకు వస్తున్నారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ‘భోళా శంకర్‌’ని నిర్మించారు. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో ‘జైలర్‌’ రూపొందింది. రెండు చిత్రాలతో థియేటర్లకు రానుండటం, ఇతర విశేషాలు తమన్నాతో జరిపిన ఇంటర్వ్యూలో ఈ విధంగా...

 ► ఈ నెల 10న ‘జైలర్‌’, 11న ‘భోళా శంకర్‌’ సినిమాలతో వస్తున్నారు. సో.. వచ్చే వారం మీకు స్పెషల్‌ అనొచ్చు...  
విషయం ఏంటంటే.. ఒకటి తమిళ సినిమా, మరొకటి తెలుగు సినిమా అయినా రెండు సినిమాలూ అన్ని భాషల్లో థియేటర్లకు వస్తున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవిగారు, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌గారు.. ఇద్దరూ దేశంలో పెద్ద స్టార్స్‌. ఇలా ఒక్క రోజు గ్యాప్‌లో ఇద్దరు స్టార్స్‌తో సినిమా అంటే కల నెరవేరినట్లు ఉంది. ఈ రెండు మాత్రమే కాదు.. నేను చేసిన ఇంకో సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అదొక మంచి ఫీలింగ్‌.  
 
► చిరంజీవి డ్యాన్స్‌ మామూలుగా ఉండదు... మీరు డ్యాన్స్‌లో బెస్ట్‌. అయితే మీ ఇద్దరికీ ‘సైరా’లో డ్యాన్స్‌ చేసే చాన్స్‌ రాలేదు.. ‘భోళా శంకర్‌’లో మీ కాంబో డ్యాన్స్‌ గురించి...
‘మిల్కీ బ్యూటీ...’ మంచి రొమాంటిక్‌ మెలోడి సాంగ్‌. ఈ పాటలో ఒక హుక్‌ స్టెప్‌ ఉంటుంది. మిగతా స్టెప్స్‌ కూడా గ్రేస్‌ఫుల్‌గా ఉంటాయి. చిరంజీవిగారి డ్యాన్స్‌ చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకే మిగతావారికి ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. పైగా శేఖర్‌ మాస్టర్‌ మంచి స్టెప్స్‌ డిజైన్‌ చేశారు. స్విట్జర్లాండ్‌లో ఈ పాట షూట్‌ జరిగింది.  పెద్దగా రిహార్సల్స్‌ చేయలేదు. అక్కడికి అక్కడే నేర్చుకుని చేసేశాం. అలాగే ఇదే సినిమాలో ‘జామ్‌ జామ్‌...’ పాట కూడా నాకు చాలా ఇష్టం.
 
► సీనియర్‌ హీరోలతో సినిమాలు చేసినప్పుడు... అంత సీనియర్స్‌తో ఎందుకు? అనే ప్రశ్న ఎదురవుతుంటుంది కదా...

ఇప్పుడు నా కెరీర్‌లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అన్ని రకాల యాక్టర్స్‌తో నటిస్తున్నాను. నాకన్నా చిన్నవాళ్లకు జోడీగా, నాకు సమానమైన ఏజ్‌ ఉన్నవాళ్లతో, సీనియర్లతో సినిమాలు చేస్తున్నాను. ఓటీటీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాను. నా కెరీర్‌లో నేనెప్పుడూ ఏజ్‌ గురించి పట్టించుకోలేదు. నేను యాక్టర్లను యాక్టర్లగా చూస్తాను. నా పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తాను. నా క్యారెక్టర్‌ ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా అన్నదే నాకు ముఖ్యం. ఏజ్‌ వల్ల ఈక్వేషన్‌ ఏం మారదు.   
 
► దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నారు. ఇంకా బిజీ బిజీగా సినిమాలు చేస్తూ  రేస్‌లో దూసుకెళ్లడానికి కారణం?

అస్సలు నేను ఇది రేస్‌ అనుకోను. చాలా చిన్న వయసులో కెరీర్‌ స్టార్ట్‌ చేశాను. జయాపజయాలనేవి మన చేతుల్లో ఉండవు. టీమ్‌ వర్క్‌ ముఖ్యం. ఒక్కోసారి కొన్ని విజయాలకు నేనూ కారణం అవుతాను. ఆ సంగతి పక్కనపెడితే.. కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే నిరంతరం హార్డ్‌వర్క్‌ చేయాలి. ఆ ఫోకస్‌తోనే వెళుతున్నాను.
 
► ఈ మధ్య కొన్ని హద్దులను దాటి, బోల్డ్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నారు.. ఈ మార్పు గురించి?

మారకపోతే నేనెక్కడ మొదలయ్యానో అక్కడే ఆగిపోయినట్లే.. అలా ఆగిపోవాలని ఎవరూ అనుకోరు. ఎవరైనా కెరీర్‌లో ఎదగాలనే అనుకుంటారు. ప్రతీ జాబ్‌లో ప్రమోషన్‌ ఉన్నట్లే మా జాబ్‌ కూడా. ప్రమోషన్‌ కోసం కొంచెం బ్రాడ్‌గా ఆలోచించాలి.. కొత్త ప్రయత్నాలు చేయాలి. అప్పుడు జర్నీ ఇంకా లాంగ్‌గా, బెటర్‌గా ఉంటుంది.
 
► ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ వెబ్‌ సిరీస్‌లో నటించిన అనుభవం గురించి?

మన చుట్టూ ఇప్పుడు రకరకాల మాటలు దొర్లుతుంటాయి. వాటిలో ఏది మంచో.. చెడో తెలుసుకోలేం. అందుకే ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ గురించి నాతో అభిమానులు, ఇంకా వేరేవాళ్లు బాగుందని అన్నప్పుడు కొత్త ప్రయత్నం రీచ్‌ అయిందనే ఆనందం కలిగింది. ముఖ్యంగా ఉమన్‌ వచ్చి బాగుందని అభినందించడంతో చాలా హ్యాపీ ఫీలయ్యాను.
 
► ఇన్నేళ్లల్లో మీ గురించి రానటువంటి వార్తలు ఇప్పుడు వస్తున్నాయి.. ఫర్‌ ఎగ్జాంపుల్‌ నటుడు విజయ్‌ వర్మ, మీ గురించి ఎక్కువ ప్రచారమవుతోంది...

ఎవరో ఏదో మాట్లాడతారు. కానీ నేను ఎప్పుడు మీడియాతో మాట్లాడినా హానెస్ట్‌గానే మాట్లాడాను. ఇక ఎవరెవరో రూమర్స్‌ క్రియేట్‌ చేస్తే నేనేం చేయలేను.  

► పెళ్లి ప్లాన్‌ ఏమైనా?
ఇప్పటికైతే లేదు. ప్లాన్‌ చేసుకున్నప్పుడు కచ్చితంగా చెబుతాను.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement