ప్రముఖ హాలీవుడ్ నటుడు రాన్ ఎలీ (86) ఇకలేరు. ఆయన మరణించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రాన్ ఎలీ కుమార్తె క్రిస్టెన్ వెల్లడించారు. ‘‘ఓ గొప్ప వ్యక్తి ఈ ప్రపంచానికి దూరమయ్యారు. అలాగే నేను నా తండ్రిని కోల్పోయాను. నటుడిగా, రచయితగా, కుటుంబంలోని వ్యక్తిగా, కోచ్‌గా, గురువుగా, నాయకుడిగా ఆయన రాణించారు’’ అని క్రిస్టెన్ పేర్కొన్నారు. ఇక అమెరికాలోని టెక్సాస్‌లో 1938లో జన్మించారు రాన్ ఎలీ. కెరీర్ ఆరంభంలో ‘సౌత్ పెసిఫిక్’, ‘ది ఫిన్డ్ హూ వాక్డ్ ది వెస్ట్’ వంటి చిత్రాల్లో నటించిన తర్వాత టెలివిజన్ సిరీస్ ‘టార్జాన్’లో నటించే అవకాశం రాన్ ఎలీకి దక్కింది. టార్జాన్‌గా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన రాన్ ఎలీకి విపరీతమైనపాపులారిటీ వచ్చింది.
ఇంకా ‘ప్లే హౌస్ 90, థ్రిల్లర్, ఫేస్ ది మ్యూజిక్’ వంటి సిరీస్‌లలో నటించారు రాన్. అలాగే ‘డాక్ సావేజ్: ది మ్యాన్ ఆఫ్ బ్రాంజ్, వన్స్ బిఫోర్ ఐ డై’ వంటి చిత్రాల్లోనూ నటించారాయన. ‘షీనా’ సిరీస్ తర్వాత కొంతకాలం నటనకు దూరంగా ఉన్న రాన్ ‘ఎక్స్‌పెక్టింగ్ ఆమిష్’ (2014) అనే సినిమాలో ఓ లీడ్ రోల్ చేశారు. ఇదే ఆయనకు చివరి సినిమా. ఈ సంగతి ఇలా ఉంచితే... రాన్ ఎలీ ఎప్పుడు మరణించారనే విషయంపై క్రిస్టెన్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆయన కొన్ని రోజుల క్రితమే మరణించారని, మరణ వార్తను క్రిస్టెన్ కాస్త ఆలస్యంగా బయటపెట్టారని వార్తలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment