
సాక్షి, అవనిగడ్డ: టాలీవుడ్ సినీ నటుడు ఆలీ కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆదివారం సందడి చేశారు. అవనిగడ్డ పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కబడ్డీ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొని కబడ్డీ కోర్టులో కూతపెట్టి పోటీలను ప్రారంభించారు. అలీతో కలిసి స్థానిక ఆర్డీవో ఖాజావలీ కూడా కబడ్డీ ఆడి అలరించారు. అనంతరం పోలో విజేతలుగా నిలిచిన వారికి అలీ చేతుల మీద బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే ఆటలపోటీలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఆటలపోటీలు నిర్వహించడం పట్ల జిల్లా ఎస్పీకి అలీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. యువతను సన్మార్గంలో నడిపించడానికి జిల్లా ఎస్పీ ఆలోచన అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి వినూత్న కార్యక్రమాలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని అలీ కోరారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ డిఎస్‌పి మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. చదవండి : నా మేనకోడలిని ఆశీర్వదించండి
అదే విధంగా మండల పరిధిలోని పులిగడ్డ ఇరిగేషన్ అతిథి గృహంలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. సతీష్ దర్శకత్వంలో అలీ ముఖ్యపాత్రలో రూపొందుతున్న చిత్రం షూటింగ్‌ని ఆదివారం నిర్వహించారు. సమాజంలో మూఢ నమ్మకాలు రూపుమాపాలనే సందేశంతో రూపొందిస్తున్న ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో అలీ నటిస్తున్నారు. ఇరిగేషన్ అతిథి గృహం ప్రాంగణంలో అలీపై పలు దృశ్యాలను చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నజీర్‌బాషాతో పాటు పలువురు నేతలు అలీని కలిసి, ఆయనను ఘనంగా సత్కరించారు. షూటింగ్ విషయం తెలుసుకున్న పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు పులి గడ్డకు తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment