ఓ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఆ కథకు సీక్వెల్ తీసే పనిలో ఉంటారు. అయితే కొనసాగించాలంటే కథలో స్కోప్ ఉండాలి. పైగా ‘అసలు కథ ఇప్పుడే మొదలైంది’ అన్నట్లుగా ఉండాలి. అలా కొన్ని చిత్రాలకు స్కోప్ దొరికింది. ‘అసలు కథ ఇప్పుడే మొదలైంది’ అన్నట్లు తొలి భాగం చివర్లో ట్విస్ట్ ఇచ్చి, మలి భాగం రూపొందించే పనిలో ఉన్నారు. ఈ ఏడాది అరడజనుకు పైగా సీక్వెల్ చిత్రాలు రానున్నాయి. ఈ రెండు భాగాల చిత్రాల గురించి తెలుసుకుందాం...
స్వాతంత్య్రం రాక ముందు...
సేనాపతి వీరశేఖరన్, అతని కొడుకు చంద్రబోస్ సేనాపతిల కథలను ‘ఇండియన్’ (1996) సినిమాలో చూశాం. ఈ రెండు పాత్రల్లోనూ కమల్‌హాసన్ నటించారు. శంకర్ దర్శకత్వం వహించారు. పాతికేళ్ల తర్వాత ‘ఇండియన్’కు సీక్వెల్‌గా కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లోనే ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. ఇందులోనూ కమల్‌ది ద్విపాత్రాభినయం. ఈ చిత్రంలో సేనాపతికి, అతని తండ్రికి మధ్య జరిగే కథను చూపిస్తారట శంకర్. అంటే.. కథ దేశ స్వాతంత్య్రానికి పూర్వం ఉంటుందని తెలుస్తోంది. అలాగే ప్రస్తుత కాలాన్ని కూడా కనెక్ట్ చేశారట. ‘ఇండియన్ 2’ ఏప్రిల్‌లో విడుదల కానుందని తెలిసింది.
మిత్రులే శత్రువులు
ఎంతోమంది జీవితాలను మార్చిన ఖాన్సార్ (‘సలార్’ చిత్రం కోసం క్రియేట్ చేసిన ప్రాంతం) ఇద్దరు మిత్రులు దేవరథ, వరదరాజ మన్నార్‌లను మాత్రం శత్రువులుగా చేసింది. మరి... ఈ మిత్రులు ఎందుకు శత్రువులు కావాల్సి వచ్చిందనే కథను ‘సలార్’ మలి భాగం ‘సలార్: శౌర్యాంగ పర్వం’లో చూడాలంటున్నారు ఈ చిత్రదర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా దేవరథ పాత్రలో నటిస్తుండగా, దేవ మిత్రుడు వరదరాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.
విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ‘సలార్: శౌర్యాంగపర్వం’ చిత్రం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ్రపారంభంలో రిలీజయ్యే చాన్స్ ఉంది. ఇక హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లోని ‘సలార్’లోని తొలి భాగం ‘సలార్: సీజ్‌ఫైర్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సలార్: శౌర్యాంగ పర్వం’ రానుంది.
పుష్పగాడి రూల్
‘పుష్ప’ సినిమాలో సిండికేట్ రూల్స్‌ను దాటి హెడ్ అయ్యాడు పుష్పరాజ్. మరి.. సిండికేట్ మెంబర్స్‌కు పుష్పరాజ్ ఎలాంటి రూల్స్ పాస్ చేశాడు? ఈ రూల్స్‌ను ఎవరైనా బ్రేక్ చేయాలనుకుంటే పుష్పరాజ్ ఏం చేసాడనేది ‘పుష్ప: ది రూల్’ చిత్రంలో చూడొచ్చు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్’ రూపొందుతోంది.
డబుల్ ఇస్మార్ట్
కిరాయి రౌడీ ఇస్మార్ట్ శంకర్‌కు సీబీఐ ఆఫీసర్ అరుణ్ మెమొరీని సైంటిఫిక్‌గా ఇంజెక్ట్ చేసి, చిప్ పెడితే ఏం జరుగుతుంది? అనేది ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కథ. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. రామ్ టైటిల్ రోల్ చేయగా, సీబీఐ ఆఫీసర్ అరుణ్‌గా సత్యదేవ్ నటించారు. 2019లో విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్నారు రామ్, పూరి. కాగా అరుణ్ జ్ఞాపకశక్తి పూర్తిగా శంకర్‌కు వచ్చేస్తే ఏం జరుగుతుంది? ఓ కిరాయి రౌడీ సీబీఐ ఆఫీసర్ అయితే ఏం చేస్తాడు? శంకర్ నిజంగానే గతం మర్చిపోతాడా? ఈ ప్రశ్నలకు సమాధానం మార్చి 18న రిలీజయ్యే ‘డబుల్ ఇస్మార్ట్’ చూస్తే తెలుస్తుంది.
యాత్ర 2
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలోని కొన్ని ఘటనలు, ఆయన పాద యాత్ర నేపథ్యంలో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘యాత్ర’. మహి వి. రాఘవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా ‘యాత్ర’ సినిమాకు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ తెరకెక్కించారు మహి వి. రాఘవ్. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా నేతగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ‘యాత్ర 2’ రూపొందింది. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా నటించారు. శివ మేక నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది.
రెట్టింపు వినోదం
డీజే టిల్లుగానితో ఎట్లుంటదో ‘డీజే టిల్లు’ సినిమాలో చూశారు ఆడియన్స్. 2022లో విడుదలైన ఈ సినిమా బంపర్ హిట్ సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డీజే టిల్లు స్క్వేర్’ రానుంది. ‘డీజే టిల్లు’లో టైటిల్ రోల్‌ని సిద్ధు జొన్నలగడ్డ చేయగా, విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సీక్వెల్‌లో సిద్ధూనే హీరో. అయితే మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కావాల్సింది. కానీ వాయిదా పడిందని తెలుస్తోంది.
గూఢచారి 2
ఏజెంట్ గోపీ 116 అనగానే తెలుగు ప్రేక్షకులకు అడివి శేష్ స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ సినిమా గుర్తుకు వస్తుంది. 2018లో విడుదలైన ఈ సినిమా బంపర్ హిట్. శశికిరణ్ తిక్క దర్శకుడు. ప్రస్తుతం ‘గూఢచారి 2’తో బిజీగా ఉన్నారు అడివి శేష్. వినయ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ‘గూఢచారి 2’ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
► గృహిణి, యూ ట్యూబర్ అనుపమా మోహన్‌గా ‘భామా కలాపం’లో మెప్పించారు ప్రియమణి. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘భామాకలాపం 2’ను రెడీ చేస్తున్నారు. బాపినీడు, సుధీర్ ఈదర నిర్మిస్తున్న ఈ సినిమాకు అభిమన్యు దర్శకుడు. అలాగే అంజలి నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘గీతాంజలి’. రాజ్‌కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2014లో విడుదలై, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ తెరకెక్కుతోంది. రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌కు శివ తుర్లపాటి దర్శకుడు. అలాగే అనుష్కా శెట్టి హిట్ ఫిల్మ్ ‘భాగమతి’కు సీక్వెల్‌గా ‘భాగమతి 2’ తెరకెక్కనుంది.
► ‘బింబిసార 2’, ‘డెవిల్ 2’ ఉంటాయన్నట్లగా కల్యాణ్ రామ్ పేర్కొన్నారు. ‘మ్యాడ్ 2’ ‘మత్తు వదలరా 2’ చిత్రాల స్క్రిప్ట్ వర్క్ జరగుతోంది. ‘హను–మాన్’కు సీక్వెల్‌గా ‘జై హను–మాన్’ను ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ‘రాక్షసుడు 2’ని దర్శకుడు రమేశ్ వర్మ ఆల్రెడీ ప్రకటించారు . ఇంకొన్ని సీక్వెల్ చిత్రాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment