
టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అంటూ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అంటే సుందరానికీ చిత్రం హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని మలయాళ ఇండస్ట్రీలో కలకలం సృష్టించిన హేమ కమిటీ నివేదికపై స్పందించారు. అంతే కాకుండా అలాగే కోల్‌కతా వైద్యవిద్యార్థినిపై జరిగిన దారుణ ఘటన తనను కలిచివేసిందన్నారు.
నాని మాట్లాడుతూ..' ఢిల్లీ నిర్భయ ఘటన తలుచుకుంటే ఇప్పటికీ నన్ను బాధిస్తోంది. మహిళలపై జరుగుతున్న దారుణాలు నిరంతరం కలవరపెడుతున్నాయి. కోల్‌కతాలో వైద్యవిద్యార్థిని సంఘటన నన్ను కలచివేసింది. మొబైల్‌ను స్క్రోలింగ్ చేయాలంటే భయంగా ఉంది. సోషల్ మీడియాలో ఎలాంటి వార్త చూడాల్సి వస్తుందో అన్న భయమేస్తోంది. హేమకమిటీ నివేదిక చూసి నేను షాకయ్యా. మహిళలపై లైంగిక వేధింపులు చూస్తుంటే ఎంత దారుణమైన స్థితిలో బతుకుతున్నామో అర్థమవుతోంది. తన సెట్స్‌లో ఇలాంటి సంఘటనలు జరగడం తానెప్పుడూ చూడలేదు. 20 సంవత్సరాల క్రితం పరిస్థితి మెరుగ్గా ఉండేది. అప్పటి రోజుల్లో మహిళలకు రక్షణ ఉండేది. ఇప్పటి పరిస్థితులు తలచుకుంటేనే చాలా దారుణంగా ఉందనిపిస్తోంది' అని అన్నారు. కాగా..నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన సరిపోదా శనివారం ఈనెల 29న థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment