
మహారథి... దర్జాగా పెరిగి సామాన్యంగా జీవించారు...
బాధ్యతలు పూర్తిచేసి.. వింధ్య పర్వతాలకు వె ళ్లి వచ్చారు...
ఎంతో పోరాటం చేసి సినీ రచయితగా నిలిచారు...
రణభేరి, బందిపోటు, పెత్తందార్లు, సింహాసనం, దేవుడు చేసిన మనుషులు, పాడి పంటలు, అల్లూరి సీతారామరాజు.. వంటి అనేక చిత్రాలకు పదునైన లయబద్ధమైన మాటలు రచించి కొత్త పంథాను సృష్టించారు..
క్రమశిక్షణ, నిజాయితీ, నిక్కచ్చితనం వల్ల సినీ పెద్దలకు దూరమయ్యారు..
తను కలలు కన్న అల్లూరి సీతారామరాజు కోసం అడవులకు వెళ్లారు...
ఆదర్శ జీవితాన్ని గడిపారు.. పిల్లలకు అదే నేర్పారు..
అంటూ తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎన్నో విషయాలు ‘సాక్షి’కి వివరించారు
మహారథి రెండవ కుమారుడు చిట్టిబాబుగా పరిచితులైన వరప్రసాద్..
నాన్న కృష్ణాజిల్లా పసుమర్రులో పుట్టారు. నాయనమ్మ పుణ్యవతి. తాతయ్య సత్యనారాయణ పసుమర్రు మునసబు. ఆయనకు రైస్ మిల్లులు ఉండేవి. నాన్నగారికి ఒక అక్క ధనలక్ష్మి, ఇద్దరు చెల్లెళ్లు.. జయప్రద, రామలక్ష్మి. తాతగారి రెండో భార్యకు ధనలక్ష్మి, మూడో భార్యకు నాన్నగారు, ఇద్దరు చెల్లెళ్లు పుట్టారు. ఆ రోజుల్లో వారసుడి కోసం తపించేవారు. లేకలేక పుట్టడంతో నాన్న ఎంతో అపురూపంగా పన్నెండు మంది దాసీల మధ్య పెరిగారు. పుట్టినప్పుడే జ్యోతిష్కుడు, ‘పిల్లాడు మహావిద్యావంతుడు అవుతాడు, కాని 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఉన్నదంతా హరించుకుపోతుంది’ అని చెప్పిన జాతకం నిజమైంది. నాన్నకు 12 సంవత్సరాలు వచ్చేసరికి తాతగారికి ఉన్న 300 ఎకరాల భూమి 16 ఎకరాల కు వచ్చేసింది. ‘పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్మకు’ అని వాళ్ల నాయనమ్మ చెప్పిన మాటతో 16 ఎకరాలు అమ్మేసి, ఆ డబ్బుతో నిజామాబాద్ ధర్మారంలో వ్యవసాయం చేసి, అక్కచెల్లెళ్ల పెళ్లిళ్లు చేసి, సన్యాసం తీసుకుని వింధ్య పర్వతాలకు వెళ్లిపోయారట. నాన్న ఏమయ్యారో తెలియక మా నాయనమ్మ దిగులుపడిపోయిందట. అక్కడ స్వామీజీలు నాన్నతో, ‘నీకు సన్యాసి యోగం లేదు, తల్లి మనసు కష్టపెట్టకు, అమ్మ దగ్గరకు వెళ్లిపో’ అనటంతో వెనక్కు వచ్చి, కాకరాల సీతారామయ్యగారి అమ్మాయి కమలను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారట.
ఎవరు చెప్పినా వినలేదు...
నాన్నగారికి మేం నలుగురు సంతానం. సత్య కిశోర్ (సి. ఏ), ఉషారాణి (బి.ఏ.), వరప్రసాద్ (చిట్టిబాబు, నేను, బి. కాం.), రాజేంద్ర అనారోగ్యం కారణ ంగా మధ్యలోనే చదువు ఆపేసి, వ్యాపారం లోకి దిగారు. మా అందరి కంటె ముందు ఒక అమ్మాయి పుట్టింది. పేరు క్రాంతి. ఆ ప్రసవం అయ్యాక అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోతే రామలక్ష్మి అత్త పెంచింది. నాన్నకు జ్యోతిష్యం బాగా తెలుసు. ఆవిడకు సంతాన యోగం లేదని నాన్న చెప్పారు. అత్తయ్య ఆ బిడ్డను తనకు దత్తతు ఇవ్వమని అడిగితే, ‘శ్రావణ శుక్రవారం పుట్టిన బిడ్డను దత్తతు ఇవ్వద్దు’ అని చెప్పినా వినకుండా, అమ్మకు కూడా చెప్పకుండా అత్తయ్యకు దత్తతు ఇచ్చారు.
సొంతవారే అవమానించారు...
నాన్నగారి చెల్లెళ్లకు ఐశ్వర్యం వచ్చాక నాన్నను చాలాసార్లు అవమానించారు. ఒకసారి సినిమా హాలు దగ్గర క్రాంతి (దత్తు వెళ్లిన అక్క) నాన్న పలకరిస్తే అవమానించింది. క్రాంతి అక్క పెళ్లి పత్రికలో ‘అభినందనలతో అనే చోట మన పేర్లు వేయమనండి’ అని అమ్మ చెప్పటంతో అత్తయ్యను అడిగారట నాన్న. ఇదంతా ఆస్తికోసం చేస్తున్నారంటూ నాన్నను నిందిస్తూ, నిష్ఠూరంగా మాట్లాడారట. అయినా నాన్న ప్రేమనే చూపారు. నాన్న బోళా శంకరుడు. ప్రశంసిస్తే పొంగిపోతారు.
క్రమశిక్షణ తప్పితే...
నాన్నగారి వివాహం అయ్యాక హైదరాబాద్ డెక్కన్ రేడియోలో అనౌన్సర్‌గా చేరారు. ఆ తరవాత కృష్ణా పత్రిక, తెలుగుదేశం పత్రికలకు పనిచేశారు. అప్పట్లో బాదర్ పేరు మీద రాసేవారు. రజాకార్ ఉద్యమంలో హిట్ లిస్ట్‌లో ఉండేవారు. కొన్నాళ్ల తరవాత అక్కడ నుంచి చెన్నై వచ్చేశారు. అప్పటికే శతకాలు రాశారు, కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు. ‘వెల్త్ లాస్ట్ నథింగ్ లాస్ట్, హెల్త్ లాస్ట్ సంథింగ్ లాస్ట్, క్యారెక్టర్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్’ అని రాసిన బోర్డును ఇంటి గుమ్మం పైన పెట్టి, బయటకు వెళ్లి వచ్చేటప్పుడు ప్రతిరోజూ తప్పనిసరిగా చదవమనే వారు. నియమాలు పాటించకపోతే గోడ కుర్చీలు, బెల్ట్ దెబ్బలు. మా స్కూల్‌కి రైల్వే గేట్ దాటి వెళ్లాలి. ఒకరోజు గేట్ ఎక్కి దూకి వెళ్లడం ట్యూషన్ మాస్టర్ చూసి, నాన్నకు చెప్పారు. నాకు ఆ రోజు బడిత పూజ. జీవితంలో మళ్లీ ఆ పని చేయలేదు.
మాట తీసుకున్నారు..
మా ముగ్గురు అన్నదమ్ముల దగ్గర, ‘మేం కట్నానికి అమ్ముడు పోము’ అని మాట తీసుకున్నారు. నా వివాహం పెళ్లి చూపులు లేకుండా జరిగింది. నాన్నగారే వెళ్లి చూసి నిశ్చయం చేశారు. అమ్మాయితో, ‘మా అబ్బాయి చూడడు, వాడు కోరుకున్నట్లుగా ఉన్నావు నువ్వు, ఒక్క పైసా కట్నం, బంగారం ఏమీ వద్దు. నీ బట్టల సూట్‌కేసుతో మా ఇంట్లో అడుగు పెట్టు’ అన్నారు నాన్న. నాన్న చూసి వచ్చాక, ‘వృద్ధాప్యం వచ్చాక కూడా గ్లామర్ ఉండేలాంటి అమ్మాయిని చూశాను’ అని చమత్కరించారు. నా భార్య ఉషాలత వాళ్లది అతి సామాన్య కుటుంబం.
పోరాడారు..
చెన్నై చేరిన కొత్తల్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో పనిచేశారు. రచయితగా ప్రవేశించటానికి పెద్ద పోరాటమే చేసి, గెలుపు సాధించారు. ‘బందిపోటు’ చిత్రంతో రచయితగా ప్రవేశం చేసి, సాధారణ భాషలో అందరికీ అర్థమయ్యేలా ఒక లయలో డైలాగులు రాసి అంతవరకు ఉన్న ఒరవడి మార్చారు. ఈ విషయంలో ఒక జర్నలిస్టు నాన్నను విమర్శించారు. నాన్న కోపంగా, ‘నేను రైటర్‌ని, అవసరమైతే ఫైటర్‌ని కూడా అవుతాను, జాగ్రత్త’ అని వార్నింగ్ ఇచ్చారు. సీతారామరాజు లైఫ్ యాంబిషన్. ఆ సినిమా కోసం పరిశ్రమలోని పెద్దవాళ్లు విరోధులయ్యారు. అమ్మతో, ‘ఈ సినిమాను దీక్షతో ఒక యజ్ఞంలాగ, తపస్సులాగ చేయాలి. దీని వల్ల కీర్తి వస్తుంది. చాలా సినిమాలు తగ్గిపోతాయి. ఆర్థికంగా ఇబ్బంది పడతాం. ఏం చేయమంటావు?’ అని అడిగితే, ‘మీకు ఎటు విశ్వాసం ఉంటే అటే వెళ్లండి’ అని అమ్మ ఇచ్చిన మాటతో తెల్లవారు జాము. మూడు గంటలకు నాన్న చింతపల్లి అడవులకు వెళ్లిపోయారు. ఏకాగ్రతతో అనుకున్నది సాధించారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా ప్రివ్యూ పెద్దల సమక్షంలో జరిగింది. దానికి పి. పుల్లయ్య గారు కూడా వచ్చారు. సినిమా పూర్తిగా చూసి, నాన్నను కౌగిలించుకుని, ‘సినిమా చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అంటూ ఆనందంగా కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. తన తపస్సు ఫలించినందుకు నాన్న పరమానందించారు. ‘నా పేరు నిలబడే సినిమాలే రాస్తాను. అదే నా కలం బలం’ అని ఎన్నో కథలు తిరస్కరిం చారు. ఫైవ్‌స్టార్ హోటల్, ప్లాట్‌ఫారమ్... రెండిటినీ సమానంగా చూసేవారు. నిజాన్ని ప్రేమించేవారు, అబద్ధాన్ని ఓపెన్‌గా ఖండించడంతో విరోధులు పెరిగారు. నాన్నను అందరూ మీసాలాయన అనేవారు.
సామాన్య జీవితం...
చాలా సాధారణంగా ఉండేవారు. మంచి డ్రెస్ వేసుకోమని అమ్మ చెబితే, ‘ఈ బట్టలు చూసి నన్ను మహారథి కాదంటారా’ అంటూ చిరిగిన వాటితోనే షూటింగ్‌కి వెళ్లిపోయేవారు. కారు, రిక్షా, ఆటో, బస్.. అన్ని ప్రయాణ సాధనాలలోనూ ప్రయాణించేవారు. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ గా భావించి, కంచంలో పెట్టినది తినేసేవారు. ఇంట్లో అందరికీ ఎవరి కంచం వారిది. ఒకసారి అన్నయ్యకు అల్యూమినియం ప్లేట్‌లో అన్నం పెట్టింది అమ్మ. ‘ఇందులో నేను తినను’ అని అన్నయ్య పేచీ పెట్టాడు. ఆ విషయం నాయనమ్మ నాన్నకు చెప్పింది. నాన్న ఆ రోజున చాలా కోపంగా, అంట్లు తోముకునే బూడిద పెట్టే పళ్లెం కడిగించి, అందులో వారం రోజుల పాటు అన్నం పెట్టమని చెప్పారు. అన్నయ్య తినలేకపోయాడు. ‘అన్నానికి విలువ ఇవ్వాలి. కంచానికి కాదు’ అని మందలించారు. ఒకసారి స్కూల్‌లో నేను పెన్ దొంగతనం చేశాను. ఎప్పట్లాగే మా నాయనమ్మ నాన్నకు విషయం చెప్పింది. నేను ఇంట్లోకి అడుగు పెడుతుంటే, ‘చిట్టి పెద్ద అబద్ధాలకోరు’ అని అందరికీ వినపడేలా మూడు సార్లు అనిపించారు. అంతే ఇంకెన్నడూ ఎవ్వరి వస్తువూ ముట్టుకోలేదు. క్యారెక్టర్ బిల్డింగ్‌లో మైండ్ గేమ్ ఆడారని పెద్దయ్యాక తెలిసింది. ఆ బీజాలు మాలో నాటుకుపోయాయి. అందువల్ల కొంత కోల్పోతున్నాం. అందుకని రోజూ నాన్న ఫొటో చూస్తూ, ‘నాన్నా! మీరు మాకు మంచి చేశారో చెడు చేశారో తెలియట్లే్లదు’ అంటుంటాను.
ఈ పేరు ఇలా వచ్చింది...
వరంగల్‌ని త్రిపురనేని వంశీకులు పరిపాలించిన కాలంలో, మహారథి అనే ఒక రాజు పేరున నాణెం ముద్రించారు. అందుకని ఆ పేరు పెట్టుకోమని స్నేహితులు చెప్పటంతో నాన్న మహారథిగా మారారు. నాన్నగారి అసలు పేరు బాలగంగాధరరావు.
అలా జరిగిపోయింది...
2011 డిసెంబరు 9 వ తేదీ నాన్నగారి సహస్ర చంద్రదర్శనం కార్యక్రమం అయ్యింది. ‘పిల్లవాడికి ఆశీర్వాదం ఇస్తాను, తీసుకురా’ అన్నారు. నేను హాస్పిటల్‌లో ఉన్నాను. డిసెంబరు 21న డిశ్చార్జ్ అయ్యాను. 2011, డిసెంబరు 23న నాన్న కన్నుమూశారు. ‘మూడు రోజుల తరవాత దహనం అవుతుంది. కాని నా శవం ఐస్ పెట్టెలో పెట్టొద్దు’ అని రాసిన ఒక లెటర్ నాన్న దిండు కింద కనిపించింది. ఆయన అన్నట్లుగానే మూడు రోజుల దాకా వాహనం రాలేదు. ఆశ్చర్యంగా మూడు రోజులూ వాసన రాలేదు. అలా నాన్న తన జాతకం కూడా చెప్పారు.
- సంభాషణ: వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment