అదృష్టం ఎవరిని ఎప్పుడు? ఎలా? వరిస్తుందో చెప్పలేం. అదృష్టం కలిసొస్తే ప్రతిభ అనేది రెండోది అవుతుంది. ముఖ్యంగా సినీ రంగంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. నటి త్రిష తమిళం, తెలుగు భాషల్లో నటించిన తొలి చిత్రాలే విజయవంతం అయ్యాయి. దీంతో అదృష్టవంతురాలు అని రుజువు చేసుకుంది. ప్రతిభను పక్కన పెడితే తన అందచందాలతో చాలాకాలం క్రేజీ కథానాయకిగా రాణించింది.
లేడీ ఓరియంట్ కథా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత త్రిష అదృష్టం కాస్త పక్కదారి పట్టింది. ఈమె నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలేవీ విజయం సాధించలేదు. అదే సమయంలో వ్యక్తిగతంగానూ ఒడిదుడుకులు ఎదుర్కొంది. అది ఆమె కెరీర్‌పై ప్రభావం పడింది. అయితే ఇటీవల దర్శకుడు మణిరత్నం త్రిష గ్రహణం విడిపించేలా పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. భారీ తారాగణం మధ్య ఆమె పోషించిన కుందవై పాత్రకు ప్రశంసలు అందుకుంది. అంతే త్రిషకు మళ్లీ పూర్వ వైభవం మొదలైంది. మళ్లీ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
అదే విధంగా పలు కారణాలతో నిలిచిపోయిన చిత్రాల్లోనూ కదలికలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు త్రిష తలుపు తడుతున్నాయి. అలా అజిత్ తాజా చిత్రంలోనూ, విజయ్ తదుపరి చిత్రంలోనూ ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీ నటించడానికి సిద్ధమవుతోంది. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే త్రిష పొన్నియిన్ సెల్వన్ పార్టు 1, 2 చిత్రాలకు కలిపి రూ.2 కోట్లు పారితోషికం అందుకుంది.
తాజాగా ఆమె తన పారితోషికాన్ని పెంచేసిందనే ప్రచారం ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. కాగా విజయ్ 67వ చిత్రాన్ని నిర్మాత లలిత్‌కుమార్ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కథానాయకిగా నటించనున్న త్రిష రూ.3 కోట్లు అడిగినట్లు సమాచారం. అయితే నిజమెంతో తెలియదు గాని నటుడు విజయ్ ఆమెను రూ.4 కోట్లు అడగమని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్న సామెత ప్రకారం హీరోనే చెబితే హీరోయిన్ చెలరేగిపోదూ! నిర్మాత ఇవ్వకపోయినా!
Comments
Please login to add a commentAdd a comment