
తమిళసినిమా: ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కన్నై నంబాదే. నటి ఆద్మిక నాయకి. భూమిక, ప్రసన్న, సతీష్, సుభిక్ష కృష్ణన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. లిపి సినీ క్రాఫ్టస్ పతాకంపై వీఎన్.రంజిత్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఇరవుక్కు ఆయిరం కంగళ్ చిత్రం ఫేమ్ ఎం.మారన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. సిద్ధు కుమార్ సంగీతాన్ని, జలందర్ వాసన్ చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. దీన్ని విడుదల హక్కులను రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందడం విశేషం.
కాగా చిత్ర యూనిట్ బుధవారం చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎం.మారన్ మాట్లాడుతూ.. ఇది క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఒక అమాయకుడు హత్యానేరంలో చిక్కుకుని, దాని నుంచి ఎలా బయటపడ్డాడు అన్నదే చిత్ర వన్ లైన్ కథ అని చెప్పారు. ఉత్కంఠ భరితంగా సాగే కథా, కథనాలు చాలా కొత్తగా ఉంటాయన్నారు. ప్రేక్షకులను రెండు గంటల పాటు చిత్రం ఎంటర్‌టెయిన్ చేస్తుందని తెలిపారు. చిత్రంలో ప్రేమ సన్నివేశాలు ఎక్కువగా ఉండవని, అయితే రెండు పాటలు ఉంటాయని చెప్పారు.
తొలి చిత్రం జానర్‌లోనే ఈ చిత్రానికి క్రైమ్ థ్రిల్లర్ కథను ఎంచుకోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు తాను ముందుగా ప్రేమ కథనే ఉదయనిధిస్టాలిన్‌కు చెప్పానని, అయితే అందులో ప్రేమతో పాటు రాజకీయ అంశాలు ఉండడంతో అది వద్దని, మీ తొలి చిత్రం ఇరవుక్కు ఆయిరం కంగళ్ చిత్రం చూశానని, చాలా నచ్చిందని, అలాంటి క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం చేద్దామని ఆయన చెప్పడంతో ఈ కథను రెడీ చేసినట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి చాయాగ్రహణం పరంగా కొత్త కలర్‌ను ట్రై చేసినట్లు కెమెరామెన్ జలందర్‌వాసన్ చెప్పారు. చిత్ర షూటింగ్‌ను 80 శాతం రాత్రి వేళ్లల్లోనే నిర్వహించినట్లు తెలిపారు.