ఓటీటీలో 'ఈ కలయిక కాస్త ఘాటు గురూ'.. తెలుగులో స్ట్రీమింగ్‌ | The Union Movie Telugu Review | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'ఈ కలయిక కాస్త ఘాటు గురూ'.. తెలుగులో స్ట్రీమింగ్‌

Published Sun, Oct 27 2024 9:38 AM | Last Updated on Sun, Oct 27 2024 10:46 AM

The Union Movie Telugu Review

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో హాలీవుడ్‌ చిత్రం ‘ది యూనియన్‌’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. ఎక్కడైనా ప్రేమికులు చాలా ఏళ్ల తరువాత కలిస్తే, చాలా హాట్‌ హాట్‌గా ఉంటుంది. కానీ ఈ ‘ది యూనియన్‌’ సినిమాలో ΄పాత ప్రేమికులు కలిసిన తరువాత ఇంత ఘాటా అని చూసే ప్రేక్షకుడు నోరెళ్లబెట్టాల్సిందే. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి విశ్లేషించుకుందాం. జూలియన్‌ ఫరియానో దర్శకత్వం వహించిన స్పై కామెడీ థ్రిల్లర్‌ సినిమా ‘ది యూనియన్‌’. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో తెలుగులోనూ ఈ సినిమాని చూడవచ్చు. 

హేమాహేమీలైన హాలీబెర్రీ, మార్క్‌ వాబర్గ్, మైక్‌ కాల్టర్‌ నటించిన ఈ సినిమా పెద్దలకు మాత్రమే. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... కథానాయకుడు మైక్‌ మెకన్నా న్యూజెర్సీ నగరంలో ఓ సాధారణ బిల్డింగ్‌ కార్మికుడు. రోజువారీ కష్టంతో తన పనేదో తాను చూసుకుపోయే మనస్తత్వం గలవాడు. కాకపోతే కాస్తంత అమ్మాయిల పట్ల పిచ్చి ఎక్కువ. హాయిగా సాగుతున్న మైక్‌ జీవితంలో అనుకోని ఓ అవాంతరం తన హైస్కూల్‌ క్రష్‌ అయిన రోక్సేన్‌ హాల్‌ ద్వారా ఎదురవుతుంది. 

25 ఏళ్ల తరువాత కలిసిన తన ప్రేమను గుర్తు చేసుకుంటూ డాన్స్‌ చేస్తూ స్పృహ తప్పుతాడు మైక్‌. అలా న్యూజెర్సీలో స్పృహ తప్పిన మైక్‌ తిరిగి కళ్లు తెరిచేసరికి లండన్‌లో ఉంటాడు. మరోపక్క ఓ బ్రీఫ్‌కేస్‌ కోసం ఇరాన్‌ తీవ్రవాదులు, నార్త్‌ కొరియా ఏజెంట్లు, రష్యన్‌ గూఢచారులు తెగ వెతికేస్తుంటారు. ఆ బ్రీఫ్‌కేస్‌లో చాలా సెన్సిటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఉంటుంది. దాని కోసం యూనియన్‌ అనే సంస్థ తమ ప్రతినిధులను చాలా మందినే  పొగొట్టుకుంటుంది. 

అసలు ఆ బ్రీఫ్‌కేస్‌కి, కథానాయకుడు మైక్‌కి సంబంధం ఏంటి? 25 ఏళ్ల తరువాత మైక్‌ ప్రియురాలు రోక్సేన్‌ హేల్‌ అతన్ని ఎందుకు కలిసింది? కలిసిన తరువాత అతను లండన్‌లో ఉండడం ఏంటి? అయినా ఓ ప్రేమికుల కలయికలో ఇంత ఘాటైన ట్విస్టులా? వీటి సమాధానాల కోసం ‘ది యూనియన్‌’ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్రేక్షకుడిని గిలిగింతలు పెట్టిస్తూ ఆద్యంతం థ్రిల్లింగ్‌ కలిగిస్తుందనడంలో సందేహం లేదు. వీకెండ్‌ మస్ట్‌ వాచ్‌ మూవీ ‘ది యూనియన్‌’.

– ఇంటూరు హరికృష్ణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement