చాలెంజింగ్ పాత్రలకు కేరాఫ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఈమె సుప్రీమ్ స్టార్ శరత్ కుమార్ వారసురాలు అన్న విషయం తెలిసిందే. అయితే స్వశక్తితోనే నటిగా ఎదిగి తనకంటూ ఒక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఈమె రాకింగ్ నటన ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురి చేస్తుంది. నాయకి, ప్రతినాయకి ఇలా ఏ తరహా పాత్రకైనా రెడీ అంటారు. కథానాయకిగా రంగ ప్రవేశం చేసినా, ప్రతినాయకిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు.
విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో శింబుకు జంటగా పోడాపొడి చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన వరలక్ష్మి శరత్ కుమార్ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో తదుపరి అవకాశాల కోసం కొంతకాలం ఎదురు చూడాల్సి వచ్చింది. అలా బాలా దర్శకత్వంలో నటించిన తారై తప్పటై చిత్రంలో నటనతో సినీ పరిశ్రమ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆపై వరలక్ష్మి నటిగా వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ముఖ్యంగా నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన సర్కార్, విశాల్ హీరోగా నటించిన సండై కోళీ 2 వంటి చిత్రాల్లో ప్రతి నాయకిగా తనదైన శైలిలో అదరగొట్టారు. చదవండి: శరత్‌బాబు-రమాప్రభ లవ్‌స్టోరీ వెనుక ఇంత కథ నడిచిందా?
ఆ తర్వాత ఈమె ఎక్కువగా ఆ తరహా పాత్రల్లోనే నటిస్తున్నారు. మధ్య మధ్యలో కథానాయిక పాత్రలనూ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలా దశాబ్దం పాటుగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. ఇటీవల ఈమె ఒక భేటీలో పేర్కొంటూ శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ చిత్రంలో జెనీలియా పాత్రలో తాను నటించాల్సి ఉందని చెప్పారు.
దర్శకుడు శంకర్ నుంచి తనకు పిలుపు వచ్చిందన్నారు. ఆడిషన్, స్క్రీన్ టెస్ట్ కూడా జరిగిందన్నారు. ఆ చిత్రంలో నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్న సమయంలో తాను నటించడానికి తన తండ్రి అనుమతించలేదని చెప్పారు. ఆ తర్వాత బాలాజీ శక్తి వేల్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రంలోనూ కథానాయికగా నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. దాన్ని నాన్న వద్దన్నారని చెప్పారు. ముందు చదువు పూర్తి చెయ్యి ఆ తర్వాత నటన గురించి ఆలోచిద్దామని చెప్పారన్నారు. అలా తన తండ్రి వల్ల చాలా అవకాశాలు మిస్ అయ్యానని వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment