టైటిల్: విడుదల పార్ట్-1
నటీనటులు: సూరి, విజయ్ సేతుపతి,భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇళవరసు తదితరులు
నిర్మాత : ఎల్రెడ్ కుమార్
దర్శకత్వం: వెట్రిమారన్
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్ రాజ్
విడుదల తేది: ఏప్రిల్ 15, 2023
కథేంటంటే..
పోలీసులకు, ప్రజా దళం అనే ఒక రివల్యూషనరీ గ్రూప్ కి మధ్య నడిచే కథ ఇది. కుమరేశన్ (సూరి) పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అతనికి ఒక కొండ ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారు. అక్కడ ప్రజాదళం సభ్యులకు, పోలీసులకు నిత్యం ఎన్‌కౌంటర్ జరుగుతుంటాయి. ప్రజాదళం లీడర్ పెరుమాళ్(విజయ్ సేతుపతి)ని పట్టుకునేందుకుప్రైవేట్ కంపెనీతో కలిసి క్యాంపుని నిర్వహిస్తుంది పోలీసు శాఖ. ఇక డ్రైవర్ కుమరేశన్ అడవిప్రాంతంలో డ్యూటీ చేసే పోలీసులకు నిత్యం ఆహారం సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో అడవిలో నివసించే యువతి తమిళరసి అలియాస్ పాప(భవాని శ్రీ)తో ప్రేమలో పడతాడు.
మరోవైపు తనపై అధికారికి తెలియకుండా కొండ ప్రాంతానికి చెందిన మహిళను కాపాడి అతని ఆగ్రహానికి గురవుతాడు. ఓసారి పెరుమాళ్ ఆచూకి కోసం కొండప్రాంతంలో నివసించేవారందరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతుంటారు. అందులో కుమరేశన్ ఇష్టపడిన యువతి తమిళరసి కూడా ఉంటుంది. పోలీసులు పెట్టే చిత్ర హింసలు చూడలేక కుమరేశన్ ఏం చేశాడు? పెరుమాళ్ కోసం సాగించే వేటలో కుమరేశన్ ఎలాంటి పాత్ర పోషించాడు? డీఎస్పీ సునీల్ మీనన్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? చివరకు పెరుమాళన్ దొరికాడా? లేదా? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
కల్ట్ కంటెంట్ తో సామాజిక మూలలలోకి వెళ్లి కథలని తెర పై ఆవిష్కరించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే దర్శకుడు వెట్రిమారన్. ఆయన సినిమాల్లో అంతర్లీనంగా సమాజంలో అణచివేయబడుతున్న ఒక వర్గం వేదన కనిపిస్తుంది. మనం ఎక్కడో విన్న, చూసిన సంఘటలనే ఆయన సినిమాగా తెరకెక్కిస్తుంటాడు. విడుదల పార్ట్ 1 కూడా ఆ తరహా సినిమానే. 1987 ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రం లోని ఒక ప్రాంతం లో జరిగే కథ. పోలీసులకు, ప్రజాదళం అనే ఒక విప్లవ పార్టీ కి మధ్య జరిగే సంఘర్షణ ఇది.
ట్రైన్ యాక్సిడెంట్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. రైలు ప్రమాదపు దృశ్యాలను చాలా సహజంగా చూపించాడు. ఆ తర్వాత కథ మొత్తం కుమరేశన్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. నిజాయితీగా ఉండే పోలీసులకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? పై అధికారులు కిందిస్థాయి అధికారులతో ఎలా ప్రవర్తిస్తారనేది కుమరేశన్ పాత్ర ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే ఈ తరహా చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. పోలీసులు, నక్సలైట్ల మధ్య పోరు కారణంగా సామాన్య ప్రజలు ఎలా నలిగిపోయారనే కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే ఇందులో ఉన్న లవ్‌స్టోరీలో కూడా కొత్తదనం లేదు. తమిళ నెటివిటీ మరీ ఎక్కువైంది.
కాకపోతే ప్రతి సన్నివేశాన్ని చాలా సహజంగా తీర్చిదిద్దారు. కొన్ని సన్నివేశాలు హృదయాలను కలిచివేస్తాయి. ముఖ్యంగా పెరుమాళ్ కోసం ఊర్లోని ఆడవాళ్లను పోలీసులు హింసించే సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. అదే సమయంలో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. పార్ట్ 2 కోసం కొన్ని అనవసరపు సన్నివేశాలను జోడించారనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం ఆట్టుకోవడంతో పాటు పార్ట్ 2పై ఆసక్తిని పెంచేస్తుంది.
ఎవరెలా చేశారంటే..
కమెడియన్‌గా ఇన్నాళ్లు నవ్వించిన సూరి.. ఇందులో కొత్త పాత్రను పోషించాడు. కుమరేశన్ పాత్రలో సూరి జీవించేశాడు. అసలు ఈ పాత్ర కోసం వెట్రిమారన్.. సూరిని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కమెడియన్‌లో ఈ యాంగిల్ ఎలా పసిగట్టాడనిపిస్తుంది. ఈ చిత్రంతో సూరి కేరీర్ చేంజ్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ప్రజాదళం నాయకుడు పెరుమాళ్‌గా విజయ్ సేతుపతి అదరగొట్టేశాడు. ఆయన తెరపై కనిపించేంది కొన్ని నిమిషాలే అయితే.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. పార్ట్ 2లో విజయ్ సేతుపతి పాత్ర నిడివి ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
కొండప్రాంతానికి చెందిన యువతి పాప అలియాస్ తమిళరసిగా భవాని శ్రీ అద్భుతంగా నటించింది. గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఇళయరాజా నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. కెమెరామెన్ పనితీరు అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
రేటింగ్ : 2.75/5
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment