
విశ్వక్ సేన్
‘‘గామి’ సినిమాలో ఫైట్స్, డైలాగ్స్, సాంగ్స్ వంటి కమర్షియల్ అంశాలు ఏవీ లేవని ముందే చెప్పి, ఆడియన్స్‌ని ప్రిపేర్ చేశాం. అయినా ఓ సినిమాకు పెద్ద కమర్షియల్ పాయింట్ భావోద్వేగం. ‘గామి’లో ఉన్న భావోద్వేగానికి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని అనుకుంటున్నా’’ అని విశ్వక్ సేన్ అన్నారు. విశ్వక్ సేన్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా విద్యాధర కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గామి’. వి సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో విశ్వక్ సేన్ చెప్పిన విశేషాలు.
► ‘వెళ్లిపోమాకే’ (2017) సినిమా విడుదలైన తర్వాత ‘గామి’ కథ విన్నాను. అప్పటికి ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా కూడా విడుదల కాలేదు. ‘గామి’ కథ విన్నప్పుడే ఈ సినిమా చేయడానికి ఐదేళ్లు పడుతుందని ఊహించాను. ఓ ఏడాదిలో పూర్తి చేయాలంటే వంద కోట్ల బడ్జెట్ కావాలి. ఈ సినిమా మొదలైనప్పటితో పోలిస్తే ఇప్పుడు నా ఇమేజ్ పెరిగింది కదా అని కథలో మార్పులు, చేర్పులు చేసి లెక్కలు వేసుకుంటే సినిమా పాడై పోయే ప్రమాదం ఉంది. దర్శకుడు విద్యాధర ‘గామి’ కోసం చాలా పరిశోధన చేశాడు. తొమ్మిదేళ్లు ఈ సినిమాపై వర్క్ చేశాడు. ఈ ఐదేళ్లూ నా లుక్‌ను ఒకేలా మెయిన్‌టైన్ చేయడం కోసం జాగ్రత్తలు తీసుకున్నాం. అఘోరాగా నా మేకప్ కోసం రెండు గంటలకు పైగా సమయం పట్టేది. ఈ సినిమాకు నేనింకా పారితోషికం తీసుకోలేదు.
►‘గామి’ చిత్రీకరణ కోసం ఐదో రోజే వారణాసి వెళ్లాం. అక్కడ అఘోరాలను గమనించాను. ఈ సినిమాలో నాకున్నవి మొత్తం రెండు పేజీల డైలాగ్స్ మాత్రమే. ఎక్కువగా నా బాడీ లాంగ్వేజ్‌తో కూడిన యాక్షన్ ఉంటుంది. పీసీఎక్స్ ఫార్మాట్‌లో మా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఈ ఫార్మాట్‌లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ‘గామి’నే అని అనుకుంటున్నాను. ∙ఈ సినిమా కోసం మా టీమ్ అంతా హిమాలయాల్లో ప్రాణాలకు తెగించి చిత్రీకరణ జరిపాం. మైనస్ 25 డిగ్రీల చలిలో షూట్ చేశాం. సినిమా కోసం ప్రాణాలు పణంగా పెట్టాం సరే.. అసలు మన మంటూ ఉంటేనే కదా.. నెక్ట్స్ సినిమాలు చేయడానికి? అని తర్వాత అనిపించింది.
ఇప్పుడైతే ‘గామి’ సినిమా చేయనేమో! ∙నటుడిగా నా కెరీర్‌లో విభిన్నమైన సినిమాలు ఉండాలనుకుంటాను. ‘ఫలక్‌నుమాదాస్’ సినిమా చేసిందీ నేనే. ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ చేసిందీ నేనే. ఇప్పుడు ‘గామి’ చేసిందీ నేనే. నా తదుపరి చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆ నెక్ట్స్ ‘మెకానిక్ రాఖీ’ చేస్తున్నాను. ‘లైలా’ అనే లవ్‌స్టోరీ ఉంది. ఈ సినిమా సెకండాఫ్‌లో అమ్మాయి పాత్రలో కనిపిస్తా. మరోవైపు ‘హ్యాష్‌టాగ్ కల్ట్’, ‘ఫలక్‌నుమాదాస్ 2’ కథలు రాస్తున్నాను. ఈ సినిమాల చిత్రీకరణ ఎప్పుడో ఇప్పుడే చెప్పలేను. నిర్మాత సుధాకర్ చెరుకూరిగారితో ఓ సినిమా కమిట్‌మెంట్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment