టాలీవుడ్ ప్రముఖ హీరో విష్వక్‌సేన్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'గామి'. వి సెల్యూలాయిడ్ సమర్పణలో విద్యాధర్ కాగిత ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. మంచి వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతోందీ చిత్రం. తాజాగా శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లిన విష్వక్‌సేన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమా సాధిస్తున్న వసూళ్ల కంటే కూడా... గామి మేకర్స్ చేసిన ప్రయత్నం గురించి ప్రేక్షకులు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ చిత్రాన్ని చాలా రిస్క్ చేసి నిర్మించినట్లు విష్వక్‌సేన్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు ఆరేళ్లు కష్టపడి తీసినట్లు చెప్పారు. కానీ తమ సినిమాకు ఇండస్ట్రీ పెద్దల నుంచి సహకారం అందలేదని పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో గామి సినిమాను కూడా నలుగురు పెద్ద మనుషులు చూసి.. తమ కష్టం గురించి మాట్లాడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. టాలీవుడ్‌లో ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదని ఆయన అన్నారు.
మరో 20 ఏళ్ల తర్వాత కూడా ఈ చిత్రం గురించి గర్వంగా చెప్పుకుంటారని ఆయన పేర్కొన్నారు. తాను చెబుతున్న మాటలు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చెబుతున్న మాటలు కావని చెప్పారు. గామి సినిమా టాక్ బాగున్నప్పటికీ కాందరు కావాలనే నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారని చెప్పారు. ఇదంతా ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని తెలిపిన విష్వక్.. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు దన్యవాదాలు తెలిపారు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రంతో త్వరలో విష్వక్‌సేన్ రానున్నారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన సరసన నేహాశెట్టి హీరోయిన్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment