టైటిల్: గామి
నటీనటులు: విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ, హారిక పెద్ద తదితరులు
నిర్మాతలు: కార్తిక్ శబరీష్, శ్వేత మొరవనేని
రచన-దర్శకత్వం: విద్యాధర్ కాగితాల
సంగీతం: నరేశ్ కుమారన్, స్వీకర్ అగస్తీ
సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపీ నందిగాం
విడుదల తేదీ: 2024 మార్చి 8
నిడివి: 2h 26m
ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకొన్న తెలుగు సినిమాగా 'గామి' వార్తల్లో నిలిచింది. ట్రైలర్ రిలీజ్ కాగానే విజువల్స్ చూసి అందరూ షాకయ్యారు. అంచనాలు పెరిగపోయాయి. ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు శివరాత్రి కానుకగా 'గామి' థియేటర్లలో విడుదలైంది. విశ్వక్ సేన్ అఘోరాగా నటించిన ఈ మూవీ ఎలా ఉంది? అంచనాలకు మించి హిట్ కొట్టిందా? లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
'గామి' కథేంటి?
శంకర్ (విశ్వక్ సేన్) హరిద్వార్‌లో ఉండే ఓ అఘోరా. ఇతడికి ఓ విచిత్రమైన సమస్య. ఎవరైనా పొరపాటున తాకితే శంకర్ ఒళ్లంతా నీలం రంగులోకి మారిపోతుంది. సృహ తప్పి పడిపోతాడు. ఇతడి వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని మిగతా అఘోరాలు అందరూ ఇతడిని ఆశ్రమం నుంచి వెళ్లగొడతారు. దీంతో తన సమస్యకు పరిష్కారం తెలుసుకునేందుకు కాశీకి వెళ్తాడు. అక్కడ ఓ సాధువు వల్ల శంకర్ సమస్యకు పరిష్కారం తెలుస్తుంది. హిమాలయాల్లో 36 ఏళ్లకు ఓసారి లభించే మాలిపత్రాలే తీసుకుంటే ఇది నయమవుతుంది. దీంతో శంకర్ హిమాలయాలకు ప్రయాణం మొదలుపెడతాడు. ఇతడికి జాహ్నవి (చౌందిని చౌదరి) కూడా తోడు వెళ్తుంది. మరి శంకర్ చివరకు మాలి పత్రాల్ని సాధించాడా? అలానే శంకర్ ఆలోచనల్లో వచ్చే ఉమ (హారిక పెద్ద), సీటీ-333(మహమ్మద్ సమాద్) ఎవరు? తెలియాలంటే 'గామి' చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
'గామి' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బొమ్మ బ్లాక్ బస్టర్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసేవాళ్లకు ఈ సినిమా నచ్చదు. కానీ డిఫరెంట్ మూవీస్, అందులోనూ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండే చిత్రాలు చూసే వాళ్లకు 'గామి'.. మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుంది. అలా అని ఈ సినిమాలో లోటుపాట్లు లేవా అంటే ఉన్నాయి. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం టాలీవుడ్‌లోనే గుర్తుండిపోయే చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందన చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
హరిద్వార్‌లో అఘోరాల ఆశ్రమంలో ఉండే ఒకడిగా శంకర్‌ని చూపించి నేరుగా కథ మొదలుపెట్టేశారు. హీరోకి ఉన్న సమస్య గురించి వివరించడం, దీనికి సొల్యూషన్ ఏంటో కూడా ఓ సాధువు.. శంకర్‌కి చెప్పడం, దీంతో హీరో పరిష్కారం కోసం హిమాలయాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం.. ఇలా సీన్లన్నీ చకాచకా సాగిపోతుంటాయి. ఈ ట్రాక్‌కి సమాంతరంగా ఇండో-చైనీస్ బోర్డర్‌లో ఓ రీసెర్చ్ ల్యాబ్‌లో ఉండే అబ్బాయి, దక్షిణ భారతదేశంలో దేవదాసి అనే ఊరిలో ఉమ అనే అమ్మాయి కథ సమాంతరంగా చూపిస్తుంటారు. దీంతో అసలు ఈ ముగ్గురికి కనెక్షన్ ఏంటా అని ఓ వైపు క్యూరియాసిటీ.. శంకర్ అసలు మాలిపత్రాల్ని ఎలా సాధిస్తాడనే టెన్షన్ ఓవైపు నుంచి ఉంటుంది.
అయితే ఏదో కావాలని పెట్టినట్లు ఇంటర్వెల్ పడుతుంది. ఆ తర్వాత శంకర్‌తో తాను కూడా హిమాలయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో జాహ్నవి చెబుతుంది. అయితే ఫస్టాప్‌లో సినిమా వేగంగా నడుస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి నెమ్మదిస్తుంది. కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో రోప్ సాయంతో శంకర్-జాహ్నవి చేసే అడ్వెంచర్ సీక్వెల్ ఒకటు ఉంటుంది. చూస్తుంటే టెన్షన్‌తో సచ్చిపోతాం. చివర్లో సింహాం ఓ రెండు మూడు సీన్లలో కనిపిస్తుంది. ఆ సీన్స్‌ని ఇంకాస్త ఎఫెక్టివ్‌గా తీసుండాల్సింది.
ఇకపోతే శంకర్‌కి అతడి ఆలోచనల్లో వచ్చే ఇద్దరు వ్యక్తులకు మధ్య రిలేషన్ ఏంటనేది క్లైమాక్స్‌లో రివీల్ అవుతుంది. అయితే దీన్ని సినిమా ప్రారంభంలోనే చాలామంది ఊహించేస్తారు. చివర్లో చూసినప్పుడు ఇది ఇంప్రెసివ్‌గా అనిపిస్తుంది. ఇందులో శివుడి రిఫరెన్సులు కొన్ని ఉన్నాయి. అవి శివభక్తులని ఆకట్టుకుంటాయి. అయితే శంకర్ ఫ్లాట్ రాసుకున్నంత శ్రద్ధగా.. దేవదాసి ట్రాక్, రీసెర్చ్ ట్రాక్ రాసుకోలేదు. సినిమాలో ఇది కాస్త వెలితిగా అనిపిస్తుంది.
ఎవరెలా చేశారు?
మాస్, కమర్షియల్ పాత్రలతో మనకు తెలిసిన విశ్వక్ సేన్.. ఇందులో అఘోరా శంకర్‌గా కొత్తగా కనిపిస్తాడు. సినిమా అంతా కూడా ఒకే కాస్ట్యూమ్‌లో ఉంటాడు. చెప్పాలంటే ఇందులో అతడి హీరో కాదు కథలో ప్రధాన పాత్రధారి అంతే. ఆ క్యారెక్టర్‌కి ఫెర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయాడు. ఇక సీటీ-333 పాత్ర చేసి మహమ్మద్ సమాద్, దుర్గ పాత్ర చేసిన హారిక అనే చైల్డ్ ఆర్టిస్టు వాళ్లకిచ్చిన పాత్రల్లో ఆకట్టుకున్నారు. చాందిని చౌదరి రోల్ ఉన్నంతలో బాగా చేసింది. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఈ సినిమా కోసం ఏళ్లకు ఏళ్లు కష్టపడిన దర్శకుడు విద్యాధర్‌ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. సినిమా మొదలైన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు చాలా అంటే చాలా ఇంప్రెస్ చేస్తాడు. ఓ కొత్త దర్శకుడు ఈ రేంజులో సినిమా తీశాడా అంటే నమ్మలేం. ఇతడి తర్వాత సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్, ర్యాంపీ.. హిమాలయాల్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాకు కథ ఎంత ప్లస్ అయిందో.. సంగీతం అంతకు మించి ప్లస్ అయింది. స్వీకర్ అగస్తీ పాటలు.. నరేశ్ కుమారన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరోస్థాయిలో నిలబెట్టాయి. ఓవరాల్‌గా చెప్పుకొంటే 'గామి' ఓ డిఫరెంట్ అటెంప్ట్. ఎలాంటి అంచనాల్లేకుండా వెళ్లండి. మిమ్మల్ని అంతకు మించి ఆశ్చర్యపరుస్తుంది.
-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment