
మళ్లీ పులి సంచారం..!
కాటారం/కాళేశ్వరం: మండలంలోని నస్తూర్‌పల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం ప్రకంపనలు సృష్టిస్తుంది. అడవి ప్రాంతంలో తప్పిపోయిన ఎద్దు కోసం వెళ్లిన వ్యక్తికి పులి కనిపించినట్లు బయటకు రావడంతో అటు దిశగా విచారణ చేపట్టిన అటవీశాఖ అధికారులకు ఆనవాళ్లు కనిపించాయి. కాటారం మండలం నస్తూర్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి ఎద్దు తప్పిపోవడంతో సోమవారం తెల్లవారుజామున ఎద్దు జాడ కోసం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. ఎద్దు ఆచూకీ లభించడంతో తిరిగి వస్తున్న క్రమంలో పులి వెళ్లడం గమనించినట్లు పలువురు గ్రామస్తులకు తెలిపారు. దీంతో అటవీశాఖ అధికారులకు సమాచారం చేరడంతో అటవీ ప్రాంతానికి చేరుకొని పులి సంచారంపై విచారణ చేపట్టారు.
మహారాష్ట్ర టు చెన్నూర్..
రెండేళ్ల క్రితం డిసెంబర్, జనవరి మాసంలో మండలంలో పులి సంచరించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించి పూర్తి నిఘా పెట్టారు. కానీ పులి మండలంలో పలు ప్రాంతాల్లో తిరిగాడి చివరగా అదిలాబాద్ ఉమ్మడి జిల్లా చెన్నూర్ వైపుగా వెళ్లినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం కూడా మహారాష్ట్ర నుంచి మహదేవపూర్ అటవీప్రాంతం మీదుగా మండలంలోకి ప్రవేశించిన పులి ఒడిపిలవంచ, జాదారావుపేట, దామెరకుంట లేదా విలాసాగర్ మీదుగా చెన్నూర్ అటవి ప్రాంతంలోకి చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని అటవిలో నీటి వనరులు, శాఖాహార జంతువుల సంఖ్య తక్కువగా ఉండటంతో పులి నిలకడగా ఉండే పరిస్థితి లేదంటున్నారు. పులి అలజడి మొదలవడంతో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి పూట అటవి ప్రాంతంలోకి వెళ్లొద్దని ప్రజలు అధికారులకు సూచిస్తున్నారు.
పాదముద్రలు సేకరించాం..
నస్తూర్‌పల్లి గ్రామానికి సమీపంలో అటవీప్రాంతంలో పులిని చూసినట్లు ఓ వ్యక్తి చెప్పడంతో సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లాం. పలుచోట్ల పులి పాదముద్రలను గుర్తించి సేకరించాం. మరింత సమాచారం సేకరిస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపై విచారణ జరిపి పులి ఎటు వెళ్లిందో తెలుసుకుంటాం.
– రాజేశ్వర్, డిప్యూటీ రేంజర్, మహదేవపూర్
అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment