
‘మండమెలిగె’కు పూజారులు సిద్ధం..
నేటి నుంచి మినీ మేడారం (మండమెలిగె)
ముస్తాబైన మేడారం
ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయబద్ధంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
ఎస్‌ఎస్ తాడ్వాయి : జిల్లాలోని ఎస్‌ఎస్ తాడ్వాయి మండల పరిధిలో గల మేడారం సమ్మక్క–సారలమ్మ మినీ జాతర (మండమెలిగె) పండుగ నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడారం, కన్నెపల్లిలోని ఆలయాలు, గద్దెల ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు. జాతర మొదటి రోజు (బుధవారం) మేడారం, కన్నెపల్లిలోని అమ్మవార్ల ఆలయాల్లో మండమెలిగె పండుగను సమ్మక్క–సారలమ్మ పూజారులు నిర్వహించనున్నారు.
ముందుగా సమ్మక్క గుడి శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆడపడుచులు రంగవల్లులు వేసి ముస్తాబు చేస్తారు. డోలు వాయిద్యాలతో తూర్పు, పడమర పొలిమేర్లలో ధ్వజస్తంభాలు (దిష్టి తగలకుండా) మామిడి తోరణాలతో అలంకరిస్తారు. ముందుగా పూజారులు గ్రామ దేవతలకు పసుపు, కుంకుమ పెట్టి పూజలు చేస్తారు. అనంతరం గుడికి చేరుకొని అమ్మవారికి దీప, ధూపాలతో పూజలు నిర్వహించి యాటతో నైవేద్యం సమర్పిస్తారు.
రాత్రి సమయంలో పూజారులు అమ్మవారి పూజాసామగ్రి, పసుపు, కుంకుమలను తీసుకొని డోలు వాయిద్యాలతో గద్దెల వద్దకు వెళ్లి అమ్మవారి గద్దె వద్ద కూడా పూజలు చేస్తారు. అలాగే, కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో కూడా సారలమ్మ పూజారులు అమ్మవారికి పూజలు నిర్వహించి రాత్రి సమయంలో గద్దెల ప్రాంగణంలోకి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. సమ్మక్క–సారలమ్మ పూజారులు గద్దెల వద్ద కలుసుకొని శాకాహానం (ఇప్పపువ్వు సారా) ఇచ్చి పుచ్చుకొని రాత్రంతా గద్దెల వద్ద డోలు వాయిద్యాలతో జాగారం చేస్తూ సంబురాలు జరుపుకుంటారు.
ముస్తాబైన గద్దెల ప్రాంగణం...
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని శుభ్రం చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తుల క్యూలైన్లపై చలువ పందిళ్లు వేశారు. మంచినీటి సౌకర్యం కల్పించారు. హైమాస్ట్ లైట్ల ఏర్పాటుతో పాటు అమ్మవార్ల గద్దెలు జిగేల్‌మనేలా సాలాహారం చుట్టూ విద్యుత్ దీపాలను అలంకరించారు. మధ్యాహ్నం సమయంలో ఎండతీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రాంగణంలో కాళ్లు కాలకుండా కూల్ పెయింట్ వేశారు.

‘మండమెలిగె’కు పూజారులు సిద్ధం..

‘మండమెలిగె’కు పూజారులు సిద్ధం..

‘మండమెలిగె’కు పూజారులు సిద్ధం..
Comments
Please login to add a commentAdd a comment