
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
ములుగు: ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు మొదటి దశ శిక్షణ తరగతులను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని 174 గ్రామపంచాయతీల్లో 87ఎంపీటీసీ స్థానాలు, 10 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి ముందస్తుగానే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా ముందుకుసాగాలని సూచించారు. ఆర్‌ఓలు నోటిఫికేషన్ జారీ చేసి మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ల ప్రక్రియను చేపట్టాల్సి వస్తుందని తెలిపారు. తదుపరి అన్ని రకాల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. బ్యాలెట్ పేపర్‌ను అభ్యర్థుల పేర్లపై అక్షర క్రమంగా ముద్రించాల్సి ఉంటుందని వివరించారు. నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ప్రతిరోజూ రిపోర్ట్‌ను అందించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల స్వీకరణ, విత్‌డ్రాలను వీడియో చిత్రీకరణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఎంపీడీఓలు, ఆర్‌ఓలు, సహాయ ఆర్‌ఓలు పాల్గొన్నారు.
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
వచ్చే నెల 21వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఉత్తమ ఫలితాల కోసం ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా పాటుపడాలన్నారు. డీఈఓ పాణిని ప్రతిరోజూ అన్ని మండలాల విద్యాశాఖ అధికారులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి వార్షిక పరీక్షలకు తమ చిన్నారులను పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యేలా చూడాలనే విషయాన్ని వివరించాలన్నారు. 40 రోజుల ప్రత్యేక కార్యాచరణతో ఉత్తమ ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు కార్యదర్శి సూర్యనారాయణ, ఏసీజీ అప్పని జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
Comments
Please login to add a commentAdd a comment