
గిరిజన యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయించాలి
ఏటూరునాగారం: గిరిజన యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయించి పక్కా భవనాలు నిర్మించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని బీఆర్ ఫంక్షన్‌హాల్‌లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ములుగు జిల్లా 3వ మహాసభలను పురస్కరించుకుని మంగళవారం జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో విద్యారంగాన్ని మొత్తం ప్రైవేట్ పరం చేయాలని చూస్తుందన్నారు. ములుగు జిల్లాకిచ్చిన గిరిజన యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. దీంతో పక్క భవనాల నిర్మాణం ఎలా జరుగుతుందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే చెల్లించాలన్నారు. 8నెలలుగా మెస్ కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి టీఎల్.రవి, ఉపాధ్యక్షుడు సాదు రాకేష్, మోర లక్ష్మణ్, రవితేజ, బాలేశ్వర్, భరత్, రంజిత్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్
Comments
Please login to add a commentAdd a comment