డీసీసీ పీఠాలపై ఎవరు..?
సాక్షిప్రతినిధి, వరంగల్ :
జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లపై కసరత్తు క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. ప్రభుత్వ పథకాల ప్రచారంతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కమిటీలుండాలని అధిష్టానం భావిస్తోంది. ఈ ఏడాదంతా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీల పాలకవర్గం పదవీకాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. మరోవైపు ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా ఎన్నికల నిర్వహించేందుకు వీలుగా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా డీసీసీల నియామకంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది.
ఎమ్మెల్యేలు లేదంటే సీనియర్‌లు..
టీపీసీసీ, అధిష్టానం సంకేతాల మేరకు త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి కొత్త జిల్లా అధ్యక్షులు రానున్నారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి, సమన్వయం చే యగలిగే వ్యక్తులను ఎంపిక చేయాలని ఆలోచిస్తు న్న అధిష్టానం.. ఆర్థికంగా బలంగా ఉండే వాళ్లను తీసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను గానీ, సీనియర్‌లను గానీ ఈసారి నియమించే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెబుతున్నా యి. హనుమకొండ జిల్లాలో ఇద్దరు, వరంగల్‌లో ముగ్గురు, మహబూబాబాద్‌లో ఇద్దరు అధికార పా ర్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. జనగామలో ఇద్దరు, ము లుగు, జేఎస్ భూపాలపల్లిలో ఒక్కరేసి ఉన్నారు.
● హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మరోసారి కొనసాగాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని అధిష్టానం కోరుతున్నా ఆయన ససేమిరా అంటున్నట్లు తెలిసింది. పార్టీ సీనియర్, తనకు అనుచరుడిగా ఉండే ఇద్దరు పేర్లు సూచిస్తున్నట్లు చెబుతున్నారు.
● వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగించాలని కొందరు.. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలని మరికొందరు సూచించినట్లు సమాచారం. ఈ విషయంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్‌రెడ్డిల నిర్ణయం ఫైనల్ కానుంది.
● మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా భరత్‌చంద్రారెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్‌లతోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిల నిర్ణయం కీలకంగా కానుంది.
● జేఎస్ భూపాలపల్లి అధ్యక్షుడు అయిత ప్రకాష్‌రెడ్డి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నందున.. అయననే కొనసాగించాలా? మార్చాలా? అన్న విషయమై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో టీపీసీసీ చర్చించింది.
● ములుగు జిల్లా నుంచి మళ్లీ పైడాకుల అశోక్‌కే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.
● జనగామ జిల్లా అధ్యక్ష పదవికి పోటీ ఏర్పడుతోంది. కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని కొనసాగించలేని పరిస్థితి వస్తే ఎలా? అన్న చర్చపై ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అత్త, పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పేరును ఆ జిల్లా ఎమ్మెల్యేలు ప్రతిపాదించినట్లు ప్రచారం ఉంది.
అనివార్యంగా మారిన డీసీసీ అధ్యక్షుల నియామకం..
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల తర్వాత రేవంత్ రెడ్డి సిఫారసు మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ డీసీసీ కమిటీలను ప్రకటించారు. రెండు విడతల్లో ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. మొదటి విడతలో నియమితులైన అధ్యక్షుల పదవీకాలం రెండేళ్లు దాటిపోగా.. రెండో విడత డీసీసీలకు రెండేళ్లు కావొస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్టానానికి కొత్త కమిటీల ఏర్పాటు అనివార్యంగా మారింది. 2022, డిసెంబర్ 10న హనుమకొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు డీసీసీ అధ్యక్షులుగా నాయిని రాజేందర్ రెడ్డి, నల్లెల కుమారస్వామి, జె.భరత్‌చంద్రారెడ్డిలను నియమించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ములుగు జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి అనారోగ్యంతో మృతిచెందాడు. 2023, మే 16న కుమారస్వామి స్థానంలో పైడాకుల అశోక్‌ను ములుగు అధ్యక్షుడిగా.. వరంగల్‌కు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, జేఎస్ భూ పాలపల్లికి ఎ.ప్రకాష్‌రెడ్డిలను నియమించారు. జనగామ జిల్లా అధ్యక్షుడి నియామకం అప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిల మధ్య వివాదంగా మారినా.. చివరకు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డినే నియమించారు. ఆ తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొంది రేవంత్‌రెడ్డి సీఎం కావడం, టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ నియమితులయ్యారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీలపై టీపీసీసీ కసరత్తు
‘స్థానిక’ఎన్నికలే లక్ష్యంగా
కొత్త కమిటీలు
జిల్లా అధ్యక్షుల నియామకంపై
అభిప్రాయ సేకరణ
ఎమ్మెల్యేలు, సీనియర్‌లతో
అధిష్టానం సంప్రదింపులు
అవకాశం రాని సీనియర్‌లకు
టీపీసీసీలో స్థానం
నెలాఖరులో కొలిక్కి వచ్చే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment