హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట : మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, చింతామణి జలపాతం, వనదేవత(దైత) అమ్మవారి ప్రాంత పరిసరాల్లో కోలాహలం నెలకొంది. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు చేసి హేమాచల కొండపైకి చేరుకున్నారు. స్వయంభు స్వామివారిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు స్వామివారికి తిలతైలాభిషేకం నిర్వహించారు.సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment