ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట
ఏటూరునాగారం/ఎస్‌ఎస్ తాడ్వాయి/మంగపేట: ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు జిల్లాలోని నాలుగు చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక లారీలను మంగళవారం అధికారులు సీజ్ చేశారు. అదే విధంగా ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీల నుంచి ఇసుక తొలగించారు. వాజేడు, మంగపేట, వెంకటాపురం, మండలాల్లోని ఇసుక క్వారీల నుంచి వచ్చే లారీలను తనిఖీ చేసేందుకు పకడ్బందీగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను కేటాయించింది. ఇసుక లారీల్లో అధిక లోడు, జీరో బిల్, డబుల్ నంబర్లు, ఇతరత్రా అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం స్పెషల్ క్రైం బ్రాంచ్ పోలీసులు, రెవెన్యూ, స్థానిక పోలీసులు, జీపీ సిబ్బందిని ప్రత్యేక క్యాంప్‌లకు కేటాయించింది. దీంతో ఆయా శాఖల అధికారులు ఉదయం 6నుంచి సాయంత్రం 6వరకు తనిఖీలను చేపడుతున్నారు. ఇసుక క్వారీల్లో టీఎస్‌ఎండీసీ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడి ఇసుక రీచ్ రేజింగ్ కాంట్రాక్టర్లతో చేతులు కలిపి అక్రమ వ్యాపారం సాగిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది. దీంతో ములుగు, ఏటూరునాగా రం మండల పరిధిలోని చిన్నబోయినపల్లి, మంగపేట మండల పరిధిలోని కమలాపురం, ఎస్‌ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని కాటాపూర్ క్రాస్ వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. దీంతో ఆయా చెక్ పోస్టుల వద్ద అధికారులు ఇసుక లారీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న లారీలను అనుమతిస్తున్నారు. సరైన పత్రాలను లేని లారీలపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రెండు ఇసుక లారీలు సీజ్
చర్ల మండలం వీరాపురం నుంచి అధికలోడుతో హైదరాబాద్ వైపు వెళ్తున్న రెండు ఇసుక లారీలను సీజ్ చేసినట్లు రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ గంపల శంకర్ తెలిపారు. ఏటూరునాగారం మండల పరిధిలోని చిన్నబోయినపల్లి వద్ద సీసీఎస్, కానిస్టేబుల్, రెవెన్యూ అధికారుల టీం ఇసుక లారీలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో పరిమితికి మించి ఇసుక ఉండడంతో దానిని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించినట్లు శంకర్ వెల్లడించారు. ఈ విషయంపై స్థానిక పోలీసులను సంప్రదించగా వివరాలు వెల్లడించలేదు.
అక్కడ నింపుడు.. ఇక్కడ తీసుడు..
టీఎస్‌ఎండీసీ అధికారులు ఇష్టారీతిన ఇసుక రీచ్‌లలో లారీల్లో ఇసుక నింపుతుండగా వేబ్రిడ్జిల వద్ద అదనంగా ఉందని ఇసుక తీస్తూ ఇబ్బంది పెడుతున్నారని లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగపేట మండల పరిధిలోని చుంచుపల్లి, కమలాపురం వే బ్రిడ్జిల వద్ద అధికారులు కాంటా పెట్టి అదనంగా ఉన్న ఇసుకను తీసివేస్తేనే పాసింగ్ ఆర్డర్‌తో వే బిల్లులను ఇస్తామని నిబంధనలు విధించారు. దీంతో ప్రధాన రోడ్డు వెంట ఉన్న ఆయా వేబ్రిడ్జీల వద్ద లారీలు క్యూ కట్టాయి. అక్కడ అదనంగా నింపుడు ఎందుకు ఇక్కడ నింపిన ఇసుక తీయించడం ఎందుకని అధికారుల తీరుపై లారీ డ్రైవర్లు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఇసుక క్వారీల వద్దనే వేబ్రిడ్జిని ఏర్పాటు చేసి అనుమతి మేరకు లోడింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని లారీ డ్రైవర్లు కోరుతున్నారు.
జిల్లాలో నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు
తనిఖీల కోసం అధికారుల కేటాయింపు
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట
Comments
Please login to add a commentAdd a comment