ఇప్పపువ్వు లడ్డూ, న్యాప్కిన్ తయారీపై శిక్షణ పూర్తి
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని గిరిజన మహిళలకు ఇప్పపువ్వు లడ్డూ, న్యాప్కిన్ తయారీపై రెండు రోజుల శిక్షణను ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో ఇచ్చినట్లు జేడీఎం కొండల్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శనివారం శిక్షణ వివరాలను వెల్లడించారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మహాదేవునిగూడెం గ్రామానికి చెందిన 16మంది గిరిజన మహిళలను ఇప్పపువ్వు లడ్డూ తయారీపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే ములుగు మండలంలోని జంగాలపల్లికి చెందిన నలుగురు గిరిజన మహిళలకు న్యాప్కిన్ తయారీపై శిక్షణకు ఉట్నూరుకు రెండు రోజుల శిక్షణ, అవగాహన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్నారని తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు ఇప్పపువ్వు లడ్డూ, న్యాప్కిన్ తయారీ చేసి ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు.
పోలీసుల అదుపులో గొత్తికోయలు
ఏటూరునాగారం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి మండల పరిధిలోని రామన్నగూడెం, రాంనగర్ ప్రాంతాలకు మిర్చికోతల పనులకు వచ్చిన 15మంది గొత్తికోయలను శనివారం తెల్లవారు జామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. గొత్తికోయగూడెంతో పాటు గొత్తికోయ గిరిజనుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన కూలీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి వివరాలు కూపిలాగుతున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు చెందిన వారు ఏజెన్సీలో ఎక్కడెక్కడ మకాం వేశారని ఆరా తీస్తున్నారు. కూలీలను తీసుకొచ్చే రైతులకు సైతం పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం.
ఫాస్టాగ్ నుంచి
మినహాయింపు
ఏటూరునాగారం: ఏటూరునాగారం మండలంలోని నాలుగు చక్రాల వాహనాలతో పాటు ఆపై వాటికి అటవీశాఖ ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఉంటుందని అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏటూరునాగరంలో ఫాస్టాగ్ చెక్ పోస్ట్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మండలంలోని కార్లు, టాటా మ్యాజిక్, ఇతర ఫోర్ వీల్స్ వాహనాల యజమానులు వారి వాహనాల వివరాలను ఫారెస్ట్ రేంజ్ అధికారి కార్యాలయంలో తెలపాలని కోరారు. ఆ వాహనాలకు మాత్రమే ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఉంటుందని వివరించారు. ఈ అవశాకాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment