Telangana News: ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి అనూహ్య స్పందన! కమిషనర్‌ శ్రీహరిరాజు
Sakshi News home page

‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి అనూహ్య స్పందన! కమిషనర్‌ శ్రీహరిరాజు

Published Sun, Sep 24 2023 1:30 AM | Last Updated on Sun, Sep 24 2023 10:16 AM

- - Sakshi

‘సాక్షి’ ఫోన్‌

నాగర్‌కర్నూల్‌: పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తామని, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, కౌన్సిలర్లు, ప్రజల సహకారంతో పట్టణాన్ని అన్నిరంగాల్లో ముందుంచుతామని అచ్చంపేట మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరిరాజు అన్నారు. శనివారం ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది.

పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు కమిషనర్‌కు నేరుగా ఫోన్‌ చేసి తమ సమస్యలను చెప్పగా.. ఆయన పరిష్కార మార్గాలు వివరించారు. అన్ని వార్డులను పర్యవేక్షిస్తున్నామని, మున్సిపల్‌ పాలకవర్గంతో చర్చించి అవసరం ఉన్నచోట అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని, ఇప్పటికే పలు వార్డుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.

కుక్కలు, పందులను పట్టణ శివారు బయట ఉంచేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఆహార, ఇతర వ్యర్థ పదార్థాలను బయట పడేయకుండా ఇళ్ల వద్దకు వచ్చే చెత్తబండికి అందించాలన్నారు. కుక్కలు ఏయే కాలనీల్లో అధికంగా ఉన్నాయో పరిశీలించి వాటి పరిస్థితులను గమనించడానికి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పర్యవేక్షణలో 4 టీంలను ఏర్పాటు చేశామన్నారు.

పెంపుడు కుక్కలకు మున్సిపల్‌ కార్యాలయం నుంచి సర్టిఫికెట్‌ తీసుకోవాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్‌హౌస్‌, చికెన్‌, మటన్‌, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి ఆహార వ్యర్థాలను రోడ్లకు ఇరువైపులా వేయకుండా సూచిస్తామన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమన్నారు.

ప్రశ్నలకు బదులుగా..
► ప్రశ్న: మా కాలనీలో డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగు రోడ్లపైనే పారుతుంది. దుర్వాసన, దోమల బెడద అధికంగా ఉంది. వీధిలైట్లు వెలగడం లేదు. – నిరంజన్‌, వెంకటస్వామి– ఏడో వార్డు, మహేష్‌, వాణి– జూబ్లీనగర్‌, కుమార్‌– ఆదర్శనగర్‌, మోతీలాల్‌– మధురానగర్‌, రతన్‌కుమార్‌– సాయినగర్‌.
కమిషనర్‌: వీధిలైట్లను వెంటనే ఏర్పాటు చేస్తాం. సిబ్బందితో కాల్వలు శుభ్రం చేయిస్తాం. కొత్త కాల్వల నిర్మాణానికి కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్తా.

► ప్రశ్న: టీచర్స్‌కాలనీలో ఇళ్లపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ తీగలను తొలగించాలి. – శ్రీశైలం, ఉపాధ్యాయుడు
కమిషనర్‌: 
సంబంధిత విద్యుత్‌ శాఖ అధికారులకు తెలియజేస్తాం. సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం.

► ప్రశ్న: మధురానగర్‌ మూడో రోడ్డులో కంపచెట్లను తొలగించాలి. – లాలయ్య, మధురానగర్‌ కాలనీ
కమిషనర్‌: రెండు రోజుల్లో కంప చెట్లను తొలగిస్తాం.

► ప్రశ్న: ఆర్టీసీ బస్‌ డిపో వెనక వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. – అష్రఫ్‌, పట్టణవాసి
కమిషనర్‌: రెండు రోజుల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయిస్తాం.

► ప్రశ్న: పట్టణంలోని నాగర్‌కర్నూల్‌ ప్రధాన రహదారి మంజు టెంట్‌ హౌజ్‌ వెనక భాగంలో వర్షపు నీరు నిలిచి దుర్గంధం వస్తుంది. – తాహేర్‌పాష, టీచర్‌
కమిషనర్‌:
పరిశీలించి పరిష్కరిస్తాం.

► ప్రశ్న: అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. – మండికారి బాలాజీ, మణికంఠ, అచ్చంపేట
కమిషనర్‌: నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టకపోతే చర్యలు తీసుకుంటాం.

► ప్రశ్న: వెంకటేశ్వరనగర్‌కాలనీలో మురుగు కాల్వలు నిర్మించాలి. – శ్రీధర్‌ టీచర్‌, రాణాప్రతాప్‌, మాజీ ఆర్మీజవాన్‌, వెంకటేశ్వరనగర్‌ కాలనీ
కమిషనర్‌: మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్తాం. త్వరలోనే సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం.

► ప్రశ్న: పట్టణంలోని 18వ వార్డు, విద్యానగర్‌ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మిషన్‌ భగీరథ నీరు సరిగా రావడం లేదు. మూడో వార్డులో బోరు మోటారు రిపేర్‌ చేయాలి. – మాధవి– 18వ వార్డు, శివకుమార్‌– 3వ వార్డు, పద్మ– విద్యానగర్‌కాలనీ, కృష్ణ– జూబ్లీనగర్‌, సాయిరాం– 18వ వార్డు.
కమిషనర్‌: వాటర్‌మెన్‌లతో కలిసి వార్డును పరిశీలిస్తాం. సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరిస్తాం. 3వ వార్డులో బోరు మోటారు రిపేర్‌ చేయిస్తాం.

► ప్రశ్న: పందుల పెంపకందారులకు స్థలాన్ని కేటాయించి పట్టణానికి దూరంగా ఉంచేలా చూడాలి. – ఖలీల్‌, విష్ణు, జ్యోతి, మారుతీనగర్‌.
కమిషనర్‌: ఇప్పటికే పందుల పెంపకందారులకు నాలుగు సార్లు నోటీసులు అందించాం. పట్టణ శివారుకు దూరంగా ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం.

► ప్రశ్న: పట్టణంలో కుక్కలు, పందులు, కోతుల బెడద తీవ్రంగా ఉంది. – ప్రియాంక, 9వ వార్డు, రాంమోహన్‌రావు, అడ్వకేట్‌
కమిషనర్‌: కుక్కలను పరిశీలించడానికి పట్టణంలో 4 టీంలు ఏర్పాటు చేశాం. పందుల పెంపకం దారులకు నోటీసులు అందించాం. కోతులను పట్టుకునే వారిని త్వరలోనే పిలిపిస్తాం.

► ప్రశ్న: సాయినగర్‌కాలనీ మల్లంకుంట ప్రదేశంలో, హాస్టళ్ల సమీపంలో చికెన్‌ వ్యర్థాలు పడవేస్తున్నారు. దుర్గంధం వెదజల్లుతోంది. – అరవింద్‌, సాయినగర్‌
కమిషనర్‌: చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులను పిలిపించి హెచ్చరికలు చేస్తాం. ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేసుకునేలా చూస్తాం. నిబంధనలు పాటించకపోతే జరిమానా విధించి చర్యలు తీసుకుంటాం.

► ప్రశ్న: పాతబజార్‌లో మోడల్‌ టాయిలెట్లు ఏర్పాటు చేయాలి. – గౌరీశంకర్‌, కౌన్సిలర్‌
కమిషనర్‌: పాతబజార్‌లో త్వరలోనే టాయిలెట్లు ఏర్పాటు చేస్తాం. కౌన్సిల్‌ తీర్మానం కూడా ఆమోదం పొందింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement