
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
నాగర్‌కర్నూల్: జిల్లాలోని ప్రతి గ్రామంలో అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఎంపీడీఓలను ఆదేశించారు. గురువారం సాయంత్రం జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశానికి అదనపు కలెక్టర్ దేవసహాయం, జెడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్‌తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ ఒక్క అనర్హుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కారాదని, అందుకు పూర్తి బాధ్యత అధికారులు వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇంటి పనులు వెంటనే ప్రారంభించి నాణ్యతగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా జరిగేలా అధికారులు కృషి చేయాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా రానున్న వేసవిలో గ్రామాల్లో నీటిఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అవసరమైన దగ్గర మరమ్మతులు పూర్తిచేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామాలను సందర్శించి పంచాయతీ కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లాలోని 20 మండలాల ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బదావత్ సంతోష్
Comments
Please login to add a commentAdd a comment