పాలమూరు బిడ్డకు నిర్వాసితుల గోస పట్టదా?
జడ్చర్ల: పాలమూరు బిడ్డనని గొప్పగా చెప్పుకొంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి అదే పాలమూరు బిడ్డలు, నిర్వాసితుల గోస పట్టదా.. కాంట్రాక్టర్లు, కమీషన్ల కోసం నిర్మాణ వ్యయాలను పెంచుతున్న ప్రభుత్వం.. రిజర్వాయర్ కోసం భూములు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులకు పరిహారం పెంచకపోవడం ఏమిటని ఎంపీ డీకే అరుణ అన్నారు. తక్కువ ధరకు భూములు లాగేసుకున్న నాటి, నేటి ప్రభుత్వాల తీరును ఎంపీ ఎండగట్టారు. గత ఐదు రోజులుగా ఉదండాపూర్ గ్రామ సమీపంలో సమస్యల పరిష్కారం కోసం రిలే నిరహార దీక్షలు చేస్తున్న నిర్వాసితుల దీక్షా శిబిరాన్ని ఆదివారం ఆమె సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, సంబంధిత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షలు నిర్వహించినా ఎలాంటి ఫలితం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నిర్వాసితులకు న్యాయం చేయలేదన్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని రూ.25 లక్షలకు పెంచి అందజేస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. వన్‌టైం సెటిల్‌మెంట్ కింద పూర్తిస్థాయిలో పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం నయాపైసా చెల్లించలేదని విమర్శించారు. ఒకే రిజర్వాయర్ కింద రెండు రకాలుగా పరిహారం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. నిర్వాసితులకు ఇంటి స్థలాలు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తున్న వారిని పోలీసులతో భయపెట్టడం తగదన్నారు. ఇప్పటికై నా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి నిర్వాసితులను క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట బీజేపీ నాయకులు బాలవర్ధన్‌గౌడ్, పద్మజారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment