భౌరాపూర్ జాతరకు అన్ని ఏర్పాట్లు
లింగాల: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని లింగాల మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని భౌరాపూర్ క్షేత్రంలో నిర్వహించే చెంచుల జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం భౌరాపూర్ క్షేత్రంలో జాతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు, చెంచు నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 26న భ్రమరాంబిక మల్లికార్జునస్వామి కల్యాణం, రథోత్సవానికి ఆదివాసీ చెంచులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని.. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించే వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
చెంచు పెంటల అభివృద్ధికి రూ.కోటి నిధులు
నల్లమల అటవీ ప్రాంతంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్న అప్పాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చెంచు పెంటల అభివృద్ధికి రూ.కోటికి పైగా నిధులను మంజూరు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. రూ. 59లక్షలతో బావుల ఏర్పాటు, రూ. 18లక్షలతో సోలార్ లైటింగ్ సౌకర్యం, రూ. 10లక్షలతో నూతన చెక్‌డ్యాంలు నిర్మించనున్నట్లు వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా రూ. 15లక్షలతో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. త్వరలో గవర్నర్ చెంచు పెంటలను సందర్శించనున్నారని కలెక్టర్ తెలిపారు. అనంతరం అప్పాపూర్‌లోని గిరిజన ఆశ్ర మ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. డీఎఫ్‌ఓ రోహిత్ గోపిడి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఫిరంగి, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, శిశు సంక్షేమ శాఖ అధికారి రాజ్వేశ్వరి, ఆర్డీఓ మాధవి, మిషన్ భగీరథ అధికారులు సుధాకర్‌సింగ్, హేమలత, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ పాండునాయక్ ఉన్నారు.
మన్ననూర్ ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ బస
మన్ననూర్: మన్ననూర్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడే విద్యార్థులతో కలిసి రాత్రి బస చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment