ఆశలు ఆవిరి
అచ్చంపేట: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్న తరుణంలో మరోసారి కులగణన చేపట్టడంతోపాటు బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఇక ఇప్పట్లో ఎన్నికలు జరగవని తేలిపోయింది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు సుమారు మూడు నెలలకుపైగా సమయం పట్టే అవకాశం ఉండటంతో ఎన్నికల వేడి తగ్గిపోయింది. ఫలితంగా ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సంకేతాలు ఇవ్వడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. దీంతో చాలామంది ఆశావహులు పోటీ చేసేందుకు ముందుకొచ్చి ఆర్థిక వనరులు సమకూర్చకుంటున్నారు.
మూడు తగ్గి.. ఐదు పెరిగి
పరిషత్ ఎన్నికలు ముందుగా నిర్వహించి.. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా జిలా యంత్రాంగం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎంపీటీసీ స్థానాలు, ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రదర్శన, బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ఎన్నికల సామగ్రి సమకూర్చుకోవడంతో పాటు విధుల్లో పాల్గొనే పీఓ, ఏపీఓ, సిబ్బందికి శిక్షణ తదితర వాటిని పూర్తి చేసింది. గత ఎన్నికల్లో 212 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. అచ్చంపేట మున్సిపాలిటీ నుంచి విలీనం రద్దయిన అచ్చంపేట మండలం పలకపల్లి, పులిజాల, నడింపల్లి, లక్ష్మాపూర్, కొల్లాపూర్ మండలంలో ఒక ఎంపీటీసీ స్థానాలను గుర్తించగా.. అదే సమయంలో కోడేరు మండలంలోని ముత్తిరెడ్డిపల్లి, మాచిపల్లి, సింగాయపల్లి ఎంపీటీసీ స్థానాలు వనపర్తి జిల్లా ఏదుల మండలంలో కలవడంతో మూడు ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. దీంతో జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు సంఖ్య 214కి చేరుకోగా.. వీటి పరిధిలో 1,187 పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు.
● అచ్చంపేట మున్సిపాలిటీ నుంచి విడిపోయిన బల్మూర్ మండలం పొలిశెట్టిపల్లిని ఎంపీటీసీ స్థానంగా ఏర్పాటు చేస్తూ తోడేళ్లగడ్డ, రాంనగర్, పోలిశెట్టిపల్లితండాలను కలిపారు. గత ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానంగా ఉన్న చెన్నారం(పీజీ), మహదేవ్‌పూర్ గ్రామాలను తిరిగి రామాజిపల్లి ఎంపీటీసీ స్థానంలో కలిపారు.
ప్రత్యేకాధికారుల పాలన..
గతేడాది ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఆగస్టులో జిల్లా, మండల పరిషత్‌ల పదవీకాలం పూర్తవడంతో అవన్నీ ప్రత్యేకాధికారుల పాలన కిందకు వెళ్లాయి. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 26న మున్సిపాలిటీలు గడువు సైతం ముగియడంతో ప్రభుత్వం వీటికి కూడా ప్రత్యేకాధికారులను నియమించింది. ఫిబ్రవరి 16న పీఏసీఎస్, డీసీసీబీ పదవీకాలం ముగియగా.. ఆరు నెలల పాటు ప్రభుత్వం పదవీకాలం గడువు పొడిగించింది.
ప్రతిష్టాత్మకంగా తీసుకుని..
స్థానిక పోరుకు అంతా సిద్ధమవడంతో కొద్దిరోజుల క్రితం జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పంచాయతీల్లో తాము మద్దతు ఇచ్చిన వారిని గెలిపించుకోవడం, పార్టీ గుర్తులతో నిర్వహించే పరిషత్ ఎన్నికల్లో బల నిరూపణకు అన్ని పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జిల్లాలో 464 గ్రామ పంచాయతీలు, 20 జెడ్పీటీసీ, 214 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈనెలాఖరు వరకు బీసీ కులగణన పూర్తి చేసి దాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించి.. పార్లమెంట్‌కు పంపించనున్నారు. మొత్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించనుండటంతో ఆశావహుల్లో నైరాశ్యం అలుముకుంది.
ఇప్పట్లో ‘స్థానిక’ పోరు లేనట్టే..
పరిషత్, పంచాయతీ ఎన్నికలుమరింత జాప్యం
కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం వాయిదా
ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై సందిగ్ధం
వనరులు సమకూర్చుకున్న ఆశావహుల్లో నైరాశ్యం
Comments
Please login to add a commentAdd a comment