
నిర్వహణకు నిధులేవి?
మూడేళ్లుగా రైతువేదికలకు
అందని నిధులు
●
నిధుల విడుదల
నిలిచిపోయింది..
జిల్లాలో రైతువేదికల నిర్వహణకు సంబంధించి మూడేళ్లుగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. దీంతో వాటి నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్న విషయం వాస్తవమే. విద్యుత్ బిల్లుల చెల్లింపు, పారిశు ద్ధ్య నిర్వహణ కష్టతరంగా ఉంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంది.
– చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
● తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణకు ఏఈఓల పాట్లు
● మరమ్మతులు సైతం చేపట్టని వైనం
● జిల్లాలో 142 రైతువేదికలు
అచ్చంపేట: వ్యవసాయశాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతువేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. రైతువేదికల నిర్వహణపై ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయింది. ఏళ్ల తరబడి నిర్వహణ నిధులను మంజూరు చేయకపోవడంతో రైతువేదికల లక్ష్యం ఆశించిన మేర ముందుకు సాగడంలేదు. రూ.లక్షల బకాయిలు పేరుకపోవడంతో వీటి నిర్వహణ ఏఈఓలకు భారంగా మారింది. మూడేళ్లుగా సొంత ఖర్చులతో నిర్వహణ వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.
క్షేత్రస్థాయిలో సేవలు అందేలా..
రైతువేదికల్లో ప్రతి మంగళవారం రైతునేస్తంతో పాటు రైతు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హాజరయ్యే రైతులు, ఇతరులకు టీ, బిస్కెట్లు అందజేయడంతో పాటు ఇతరత్రా వాటి కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు తాగునీరు, విద్యుత్ సౌకర్యం, స్టేషనరీ, పారిశుద్ధ్య నిర్వహణ ఖర్చుల కింద ప్రభుత్వం నెలకు రూ. 9వేలు అందజేస్తామని ప్రకటించింది. ఒక్కో కేంద్రానికి మినీ భూసార పరీక్ష ల్యాబ్ కిట్లను అందజేసి.. వీటి ద్వారా వేదికల్లో భూసార పరీక్షలు చేయాల్సి ఉన్నా నిధుల విడుదల లేకపోవడంతో ఈ ప్రక్రియ కూడా అటకెక్కింది.
మూడేళ్లుగా నిలిచిన నిధులు..
జిల్లాలోని 142 కస్టర్లలో 142 రైతువేదికలు ఉన్నాయి. అందులో 2021 డిసెంబర్ నుంచి 2022 ఏప్రిల్ వరకు ఐదు నెలలపాటు ప్రతినెలా రూ. 9వేల చొప్పున గతంలో ప్రభుత్వం నిర్వహణ నిధులు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. 2022 మే నుంచి ఇప్పటి వరకు మూడేళ్లుగా ప్రభుత్వం రైతువేదికల నిర్వహణ కోసం నిధులను విడుదల చేయకపోవడంతో వ్యవసాయ విస్తరణ అధికారులు అవస్థలు పడుతున్నారు. ఒక్కో రైతువేదికకు ప్రతినెలా రూ. 9వేల చొప్పున 36 నెలలకు గాను సుమారు రూ. 3.24లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
ఏఈఓలపైనే భారం..
రైతువేదికల నిర్వహణకు ప్రభుత్వం దీర్ఘకాలికంగా నిధులు మంజూరు చేయకపోవడంతో ఏఈఓలపై భారం పడుతోంది. కనీసం పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ, కరెంటు బిల్లుల చెల్లింపు, రైతులతో సమావేశాలు, రైతునేస్తం కార్యక్రమాల నిర్వహణ ఖర్చులను తామే భరించాల్సి వస్తోందని ఎంఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల విద్యుత్ బిల్లుల చెల్లింపులు సైతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. రైతువేదికల్లో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు, వివిధ శాఖల సమావేశాల నిర్వహణ సైతం జరుగుతున్నాయి. ఈ క్రమంలో అటెండర్ నుంచి అన్ని పనులు ఏఈఓలే చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వర్షాలు, వరదలు, కోతుల బెడద కారణంగా జిల్లాలోని పలు రైతువేదికల్లో మరమ్మతు పనులు చేయాల్సి ఉండగా.. నిధులు లేక అవి అలానే ఉండిపోతున్నాయి. రైతువేదికల నిర్వహణ కోసం ప్రతినెలా నిధులు మంజూరు చేస్తే ఇబ్బందులు ఉండవని ఏఈఓలు పేర్కొంటున్నారు.
క్లస్టర్లు
142
రైతువేదికలు 142
అగ్రికల్చర్ డివిజన్లు : 4 (అచ్చంపేట, కల్వకుర్తి,
నాగర్‌కర్నూల్, కొల్లాపూర్)
ఏఈఓలు
143 మంది
పంటసాగు : 7.38 లక్షల ఎకరాలు
రైతులు : 3,30,836 మంది
వీడియో కాన్ఫరెన్స్ ఎలా?
వ్యవసాయంలో ఆధునిక సాగు పద్ధతులపై శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులచే రైతులకు అవగాహన కల్పించేందుకు వీలుగా రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించారు. తొలుత ప్రయోగాత్మకంగా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక వేదికను ఎంపిక చేశారు. ప్రస్తుతం 125 కుర్చీలు, రెండు టేబుళ్లు, 8 పెద్ద టేబుళ్లు, ఒక మైక్‌సెట్ చొప్పున ఉండగా.. రూ. 3.70లక్షలతో టెలివిజన్, సెట్‌టాప్ బాక్సులు, ఇన్వర్టర్లు ఇతర సామగ్రిని సమకుర్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాస్థాయి వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు రైతులతో నేరుగా మాట్లాడి పంటల సాగు విధానం, చీడపీడల నివారణ, ప్రభుత్వ పథకాలు తదితర వాటిపై అవసరమైన సలహాలు ఇచ్చేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. రైతు వేదికల నిర్వహణకు నిధులు విడుదల చేయకపోతే ఎలా అని ఏఈఓలు ప్రశ్నిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే సమయానికి రైతువేదికలను సిద్ధం చేయాలని.. అయితే అటెండర్ కూడా లేకపోవడంతో అన్ని పనులు తామే చేయాల్సి వస్తుందని అంటున్నారు. పైగా ప్రతినెలా తమ వేతనం నుంచే నిర్వహణ ఖర్చులు భరించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.

నిర్వహణకు నిధులేవి?

నిర్వహణకు నిధులేవి?
Comments
Please login to add a commentAdd a comment