‘సీఎం ఇంటిని ముట్టడిస్తాం’
చారకొండ: చారకొండలో జాతీయ రహదారి బైపాస్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు అన్నారు. మండల కేంద్రంలో బైపాస్ బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 10వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన బాధితులకు మద్దతుగా సంఘీభావం తెలిపి మాట్లాడారు. బైపాస్ నిర్మాణంలో అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా 29 మంది ఇళ్లను నేలమట్టం చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వారికి న్యాయం చేయాలని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గతంలో వారికి ఇచ్చిన నష్టపరిహారం ఏమాత్రం సరిపోదని, ఇంటిస్థలం కూడా రాదన్నారు. బాధితులకు నూతన స్థలం కేటాయించి.. ఇల్లు నిర్మించి ఇవ్వాలని, లేదా రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వారి న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు బాధితులకు అండగా ఉంటామన్నారు. ఈ నెల 24న చారకొండ నుంచి బైపాస్ బాధితులతో పాదయాత్రగా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సభ్యులు శ్రీనివాసులు, నాయకులు మల్లయ్య, మండల కార్యదర్శి బాలస్వామి, సీపీఐ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీను, బాధితులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment