
వైఎస్సార్ చౌరస్తా విస్తరణ కోసమని విగ్రహ దిమ్మెను తొలగించిన అధికారులు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై వైఎస్సార్ అభిమానులు మండిపడుతున్నారు. వైఎస్ విగ్రహం స్థానంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టేందుకు పట్టణానికి చెందిన ఓ నేత ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ ప్రాంతంలోనే కాకుండా మరో చోట సర్దార్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి జాతీయ నేతలను గౌరవించవచ్చుకదా.. అని పలువురు పేర్కొంటున్నారు.
మిగతా విగ్రహాలు ఎక్కడివి అక్కడే..
నీలగిరిలో రోడ్ల విస్తరణ సందర్భంగా మహనీయుల విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే పునః ప్రతిష్ఠించారు. అలాగే రోడ్డు విస్తరణ కోసం వైఎస్సార్ విగ్రహాన్ని కూడా ఇటీవల తొలగించారు. కానీ పునః ప్రతిష్ఠించే విషయంలో మాత్రం ఎందుకు వివక్ష చూపిస్తున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్‌టీఆర్ సైతం వైఎస్సార్, ఎన్‌టీఆర్ ఇద్దరు కూడా ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిన మహోన్నతులు అని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్‌టీఆర్ విగ్రహం నీలగిరి నడి బొడ్డున ఉంచి, వైఎస్సార్ విగ్రహం విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పేదల గుండెల్లో నిలిచిన నేత వైఎస్సార్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించి 2004లో ముఖ్యమంత్రి అయిన డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. పేదలకు లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిన ఘనత వైఎస్సార్‌ది. రైతులకు ఉచిత కరెంట్, రైతాంగానికి రుణమాఫీ చేసిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్సార్. అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహం తొలగించాలనే ఆలోచన చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా సదరు నేత మనసు మార్చుకోకపోతే వివిధ సామాజిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.
వైఎస్సార్ చౌరస్తాగా పేరు..
2010లో వైఎస్సార్ మరణానంతరం నీలగిరి పట్టణంలోని సాగర్ రోడ్డు వద్ద చౌరస్తాలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం వైఎస్సార్ చౌరస్తాగా పేరు పొందింది. మనం గూగుల్‌లో చూసినా అక్కడ వైఎస్సార్ చౌరస్తా అని చూపిస్తోంది. కాగా తెలంగాణ ఉద్యమంలో గుర్తు తెలియన వ్యక్తులు వైఎస్ విగ్రహానికి నిప్పు పెట్టడంతో అది సగం వరకు కాలిపోయింది. అయినప్పటికీ అక్కడ వైఎస్సార్ చౌరస్తాగానే జనమంతా పిలుచుకుంటున్నారు. ఇంతటి పేరున్న వైఎస్ విగ్రహాన్ని తొలగించాలనే ఓ నేత నిర్ణయాన్ని పట్టణ ప్రజలతో పాటు వైఎస్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విగ్రహం విషయంలో సదరు నేతకు రాజకీయాల్లో మంచి కంటే చెడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
వైఎస్ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలి
ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆ చౌరస్తాలోనే పునః ప్రతిష్ఠించాలి. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ విగ్రహం విషయంలో రాజకీయం చేయడం మంచిది కాదు. ఆయనను పార్టీలకు అతీతంగా అందరూ అభిమానిస్తారు. వైఎస్ విగ్రహం తొలగిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.
– గుమ్ముల మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు
విగ్రహం తొలగింపు ఆలోచన విరమించుకోవాలి
ఎంతో మంది హృదయాల్లో నిలిచిన వైఎస్ విగ్రహం ఎక్కడ ఉందో అక్కడే పునః ప్రతిష్ఠించాలి. విగ్రహం తొలగింపు ఆలోచనను విరమించుకోవాలి. మైనార్టీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చిన మహానేత వైఎస్సార్. అలాంటి నేత విగ్రహం తొలగించాలనుకోవడం మంచి పద్ధతి కాదు.
– బషీరుద్దీన్, బీఆర్‌ఎస్ నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment