నల్గొండ: కొడుకా.. ఎక్కడ ఉన్నావురా..మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లావు.. ఇంటికిరా.. అంటూ కన్నీరుమున్నీరవుతోంది.. ఆ గిరిజన కుటుంబం. పరీక్షలో తప్పావని దిగులు చెందకు కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లతో అభయమిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంకు తండాకు చెందిన ధనావత్ ఉమ్లా నాయక్ –సైదమ్మల దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరిలో పెద్దవాడు ధనావత్ కార్తీక్, కుమార్తె సాత్విక. ధనావత్ ఉమ్లానాయక్ వ్యవసాయ పనులు చేసుకుంటుండగా తల్లి సైదమ్మ చింతలపాలెంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది.
రెండు సబ్జెక్టులు తప్పాడనేనా..?
ధనావత్ కార్తీక్ సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో కార్తీక్ రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు.
అయితే, కార్తీక్ మనస్తాపం చెందాడో మరో కారణమో తెలియదు కానీ ఈ నెల 17న రాత్రి 7:40 గంటలకు కళాశాల హాస్టల్ నుంచి బయటికి వచ్చాడు. అనంతరం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకున్నాడు. రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఎక్కి వైజాగ్ వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌లు చూపిస్తున్నాయి.
18వ తేదీ రాత్రి 9: 30గంటలకు రైలు దిగి నడుచుకుంటూ ఆర్‌కే బీచ్ వరకు వెళ్లి సమీపంలో గల ఫేమస్ బేకరీలో 10:30గంటలకు తినుబండారాలు కొనుగోలు చేశాడు. అనంతరం తిరిగి బీచ్ వైపు వెళ్లి 2.38గంటల వరకు తిరిగినట్లు సీసీ ఫుటేజ్ చూయించింది.
ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో..
ఈ నెల 18న అర్ధరాత్రి దాటిన తర్వాత 2:58 గంటలకు బీచ్ సమీపంలోనే కార్తీక్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడి నుంచి కార్తీక్ ఎక్కడికి వెళ్లాడనేది అంతుచిక్కకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
తమ కుమారుడి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఈ నెల 19న సంగారెడ్డిలోని ఐఐటీ కళాశాలకు వెళ్లి విషయం ప్రిన్సిపాల్ దృష్టి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తల్లిదండ్రులు సంగారెడ్డిలోని కంది పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
అప్పటికే వైజాగ్‌లో ఉన్న వారి బంధువులకు సమాచారం ఇచ్చిన ఉమ్లానాయక్–సైదమ్మలు 21న వైజాగ్‌కు వెళ్లారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు వైజాగ్ పోలీసులను ఆశ్రయించగా 60మంది బృందాలుగా ఏర్పడి కార్తీక్ కోసం ఐదు రోజులుగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
గుండెలు బాదుకుంటున్న నాయనమ్మ, తాతయ్య
నాకు ఒక్కడే కుమారుడు, నా కుమారుడికి ఒక్కడే కుమారుడు అంటూ కార్తీక్ నాయనమ్మ–తాతయ్య ధర్మి, వాలు కన్నీరుమున్నీరవుతున్నారు. కార్తీక్ అదృశ్యం అయినప్పటి నుంచి బంధువులు వస్తుండటంతో వారి కన్నీటిని అపడం ఎవరితరం కావడం లేదు. మనుమడా ఎక్కడా ఉన్నా రా.. అయ్యా అంటూ గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment