Telangana: Young Man Died In A Road Accident In Nalgonda District - Sakshi
Sakshi News home page

వారం రోజుల్లో ఆస్ట్రేలియాకు.. ఇంతలోనే ప్రమాదం

Published Fri, Jul 28 2023 2:04 AM | Last Updated on Fri, Jul 28 2023 7:33 PM

- - Sakshi

నల్లగొండ క్రైం: మరో వారం రోజుల్లో ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఇదే ప్రమాదంలో మరో యువ డాక్టర్‌ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. ఈ ఘటన బుధవారం రాత్రి నల్లగొండ పట్టణంలోని సాగర్‌ రోడ్డులో వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ సట్టు సైదులు, నాగమణి దంపతులు ఉద్యోగ రీత్యా నల్లగొండ పట్టణంలోని పద్మావతి కాలనీలో అద్దెకు ఉంటున్నారు.

వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు సట్టు మహేష్‌(25) ఉన్నత చదువుల నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. మహేష్‌కు పట్టణంలోని బోయవాడకు చెందిన బత్తుల ముత్యాల్‌రావు కుమారుడు రాజు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. రాజు చైన్నెలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు. మహేష్‌, రాజు ఇద్దరూ కలిసి బుధవారం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై నల్లగొండ పట్టణ శివారులోని సాగర్‌ రోడ్డులో ఉంటున్న తమ స్నేహితుడి వద్దకు వెళ్లి రాత్రి 9గంటల సమయంలో తిరిగి నల్లగొండ పట్టణంలోకి వస్తున్నారు.

అదే సమయంలో వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ వద్ద గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టగా.. మహేష్‌ డివైడర్‌పై పడడంతో తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బైక్‌ నడుపుతున్న రాజు తలకు తీవ్రగాయాలు కాగా అతడు వెంటనే తేరుకొని రోడ్డు వెంట వచ్చే వాహనాలను ఆపుతుండగా.. వారి వెనకే వచ్చిన వాహనదారుడు రోడ్డు అడ్డంగా నిలబడి వాహనాలను ఆపసాగాడు. అదే సమయంలో ఓ కారు డ్రైవర్‌ వారిని గుర్తించి హుటాహుటిన పట్టణంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించాడు. కాగా అప్పటికే మహేష్‌ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన రాజు కోమాలోకి వెళ్లగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

మరో వారంలో జీవితంలో స్థిరపడే వారు..
మరో వారంలో మహేష్‌ ఉన్నత చదువుల నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. చైన్నెలో వైద్య విద్యను పూర్తిచేసిన బత్తుల రాజు సైతం మరో వారం రోజుల్లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. చేతికందొచ్చిన కుమారుడు మృతిచెండంతో మహేష్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం స్వ గ్రామం వల్లాలలో మహేష్‌ అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement