హస్తం పార్టీ నుంచి.. ఆరుగురు ఖరారు | - | Sakshi
Sakshi News home page

హస్తం పార్టీ నుంచి.. ఆరుగురు ఖరారు

Published Mon, Oct 16 2023 1:50 AM | Last Updated on Mon, Oct 16 2023 8:28 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆరు అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారయ్యారు. నల్లగొండ, నకిరేకల్‌, నాగార్జునసాగర్‌, హూజూర్‌నగర్‌, కోదాడ, ఆలేరు నియోజకవర్గాల నుంచి పోటీలో ఉంచే అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం ప్రకటించింది. దీంతో కొంత కాలంగా ఆశావహులు, పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు, పార్టీ కేడర్‌ ఎదురు చూపులకు తెరపడింది. ఇక మిగతా స్థానాల్లో పోటీలో నిలిచే అభ్యర్థులను త్వరలోనే ప్రకటించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. మరోవైపు జిల్లాలో కమ్యూనిస్టులకు కేటాయించే స్థానాలపైనా స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్‌ అధిష్టానం పొత్తులకు సంబంధించిన సీట్ల ఖరారు విషయంలో తర్జనభర్జన పడుతోంది.

ముఖ్య నేతలకు ముందుగానే టికెట్లు..
కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం మొదటి జాబితాలో ముఖ్యనేతలకు టికెట్లను కేటాయించింది. సీనియర్‌ నాయకుడు, కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ అయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్‌ను ప్రకటించింది. అలాగే మాజీ పీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హుజూర్‌నగర్‌, ఆయన సతీమణి పద్మావతిరెడ్డికి కోదాడ టికెట్‌ను కేటాయించింది. మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు కుందూరు జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డికి నాగార్జునసాగర్‌, నకిరేకల్‌ టికెట్‌ను ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు, ఆలేరు టికెట్‌ను బీర్ల అయిలయ్యకు కేటాయించింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాల్లో ఆరు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. త్వరలోనే రెండవ జాబితాలో మిగిలిన ఆరు సీట్లకు అభ్యర్థులను ప్రకటించనున్నారు.

కమ్యూనిస్టుల సీట్లపై రాని స్పష్టత..
పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు కేటాయించే సీట్ల విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో నిిమిర్యాలగూడ తమకు ఇవ్వాలని సీపీఎం కోరుతుండగా, మునుగోడు కావాలని సీపీఐ పట్టు పడుతున్నాయి. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆశావహుల నుంచి ఒత్తిడి తీవ్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉంది.

పోటీ ఉన్న చోట బుజ్జగింపులు
టికెట్‌ కోసం పోటీ ఉన్న చోట బుజ్జగింపుల పర్వానికి తెర తీసింది. గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులు, ఎన్నికల ఖర్చులను భరించగలిగే స్థోమత కలిగిన వారివైపే మొగ్గు చూపుతోంది. అయితే నియోజకవర్గాల్లో పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారిని పక్కన పెట్టాల్సి వస్తుండడంతో వారిని బుజ్జగించే పనిలో పడింది. భువనగిరి, సూర్యాపేట, తుంగతుర్తి, దేవరకొండ స్థానాల్లోని ఆశావహులతో మాట్లాడుతోంది. ఏకాభిప్రాయం వచ్చాక రెండో జాబితాలో ఆ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది.

ఆరోసారి నల్లగొండ బరిలో వెంకట్‌రెడ్డి
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోసారి నల్లగొండ అసెంబ్లీ బరిలో నిలువబోతున్నారు. 1999, 2004, 2009, 2014 వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రోశయ్య మంత్రివర్గంలో ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా పనిచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో కూడా మౌలిక వసతులు, పెట్టుబడులు, రేవుల శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు నల్లగొండ నుంచి మరోసారి బరిలో ఉండబోతున్నారు.

 హుజూర్‌నగర్‌ నుంచే ఉత్తమ్‌
కోదాడ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1994, 1999, 2004 ఎన్నికల్లో మూడుసార్లు పోటీ చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 1999, 2004లో గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత హుజూర్‌నగర్‌ నుంచి 2009, 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి హ్యాట్రిక్‌ విజయం సాధించారు. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా విజయం సాధించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు నాలుగోసారి ఆయన హుజూర్‌నగర్‌ నుంచి బరిలో దిగబోతున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఉన్నత ఉద్యోగం చేస్తున్న నలమాద ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి 1994లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు.

నకిరేకల్‌లో వీరేశం
నకిరేకల్‌ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలుపొందిన వేముల వీరేశం ఇప్పుడు అదే నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలువబోతున్నారు. వీరేశం 2009లో రాజకీయాల్లో అడుగు పెట్టారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన వీరేశం ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం అక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి పోటీలో ఉన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 2009, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచే గెలిచారు. ఆ తరువాత పార్టీ మారిన చిరుమర్తి ఇప్పుడు బీఆర్‌ఎస్‌నుంచి పోటీలో ఉన్నారు.

మొదటిసారి జైవీర్‌రెడ్డి, అయిలయ్య
నాగార్జునసాగర్‌ నుంచి జానారెడ్డి వారసుడిగా కుందూరు జైవీర్‌రెడ్డి మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. 2009 నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చురుగ్గా పని చేస్తున్న ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రియాశీలకంగా పని చేశారు. ప్రస్తుతం జానారెడ్డి ఆశీస్సులతో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలువబోతున్నారు. ఇక ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బీర్ల అయిలయ్య బరిలో దిగబోతున్నారు. 1991లో ఎన్‌ఎస్‌యూఐలో చేరిన ఆయన సర్పంచ్‌గా, ఎంపీటీసీ సభ్యుడిగా, కాంగ్రెస్‌ పార్టీలో వివిధ పదవుల్లో పని చేశారు. ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement