మద్దిరాల: మద్దిరాల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరికొందరి సహకారంతో భార్యకు బలవంతంగా గడ్డిమందు తాపగా ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్దిరాల మండల కేంద్రానికి చెందిన కుంచం వెంకన్న, కళమ్మ (46) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వీరికి కుమారుడు సంతానం. మండల కేంద్రంలో రెండు షటర్లను నిర్మించుకుని ఒకటి అద్దెకి ఇచ్చి మరో దాంట్లో వీరు నివసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అద్దెకిచ్చిన షటర్‌ను వెంకన్న మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయించాడు. ఈ విషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకం చేయాలని వెంకన్న కొద్ది రోజులుగా భార్యపై ఒత్తిడి చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెంకన్న రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకం కళమ్మను కోరాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో మరికొందరి సహకారంతో కళమ్మ బలవంతంగా గడ్డి మందు తాపించాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు ఇంటికి రావడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
స్థానికులు ఆమెను సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. భర్త పురుగుల మందు తాపిన విషయం ఆస్పత్రిలో వంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. వెంకన్నతో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కళమ్మ కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బ్రహ్మమురారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment