అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత
హుజూర్‌నగర్ (చింతలపాలెం): ఏపీ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను చింతలపాలెం మండలంలో శనివారం పోలీసులు పట్టుకున్నారు. స్థానిక ఎస్‌ఐ అంతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాల వద్ద మున్నేరు వాగు నుంచి చింతలపాలెం మండలం వజినేపల్లికి రెండు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా.. సమాచారం అందుకున్న ఎస్‌ఐ వజినేపల్లి వద్ద ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఎన్టీఆర్ కృష్ణా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్లు గుంజ రాము, లింగయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కొంగలు బర్డ్ ఫ్లూతో చనిపోలేదు
● ప్రజలు భయాందోళన చెందవద్దు
● త్రిపురారం మండల పశు వైద్యాధికారి నాగేందర్
త్రిపురారం: త్రిపురారం మండల కేంద్రం నుంచి కుక్కడం వెళ్లే హదారిలో కృషి విజ్ఞాన కేంద్రం వద్ద మృతిచెందిన కొంగలు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోలేదని, అవి సాధారణంగా చనిపొయి రోడ్డుపై పడి ఉన్నాయని త్రిపురారం మండల పశు వైద్యాధికారి నాగేందర్ అన్నారు. శుక్రవారం కొంగలు మృత్యువాత అని సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన ఆయన కొంగలు మృతిచెందిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. పెద్ద చెట్లపై కొంగలు ఎక్కువగా ఉండడం వల్ల అవి కొట్లాడుకొని అందులో కొన్ని మాత్రమే చనిపోయాయన్నారు. మిగిలి ఉన్న పక్షులు ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఒకే చోట 50 నుంచి 100 పక్షులు చనిపోతేనే బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు గుర్తించవచ్చని, ప్రస్తుతం మండలంలో ఎలాంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్
సూర్యాపేటటౌన్: గంజాయి విక్రయించడంతో పాటు సేవిస్తున్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం సూర్యాపేట రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ విలేకరులకు వెల్లడించారు. శుక్రవారం సూర్యాపేట రూరల్ ఎస్‌ఐ ఎన్. బాలునాయక్ తన సిబ్బందితో కలిసి సూర్యాపేట మండలం కేసారం వెళ్తుండగా.. గ్రామ శివారులో నలుగురు యవకులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వారిలో ముగ్గురిని పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో కేసారం గ్రామానికి చెందిన మెంతబోయిన గణేష్, గొర్ల శివారెడ్డి, రామారం గ్రామానికి చెందిన పబ్బు వినయ్ ఉన్నారు. వారిని విచారించగా.. ఒడిషా రాష్ట్రంలోని అంపదర్ గ్రామానికి చెందిన ఆనంద్ నుంచి గంజాయి కిలో రూ.2వేలకు కొనుగోలు చేసి బైక్‌పై సూర్యాపేటకు తీసుకొచ్చి విక్రయిస్తామని, అదేవిధంగా నలుగురం కలిసి కేసారం గ్రామ శివారులోని శ్మశాన వాటికలో గంజాయి తాగుతామని ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసారం గ్రామానికి చెందిన మామిడి గోపి, ఒడిషా రాష్ట్రంలోని అంపదర్ గ్రామానికి చెందిన ఆనంద్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రూరల్ ఎస్‌ఐ బాలునాయక్, పెన్‌పహాడ్ ఎస్‌ఐ గోపికృష్ణ పాల్గొన్నారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment