రేపే ఎమ్మెల్సీ కౌంటింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ 3వ తేదీన (సోమవారం) జరుగనుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు. గురువారం పోలింగ్ ముగిసిన తర్వాత 12 జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను నల్లగొండకు తరలించి ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. 3వ తేదీన ఉదయం వాటికి బయటకు తీసి అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో 25,797 ఓట్లకు గాను 24,139 ఓట్లు (93.57 శాతం) పోల్ అయ్యాయి.
25 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు
25 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు. ఒక్కో టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌తో పాటు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రోఅబ్జర్వర్ ఉంటారు. మొత్తంగా 30 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 30 మంది మైక్రోఅబ్జర్వర్లను నియమించారు. మరో 250 మంది సిబ్బందిని స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులు తీసుకురావడానికి, కౌంటింగ్‌లో ఇతర పనులకు వినియోగించేందుకు నియమించారు. 250 మంది పోలీసులు అక్కడ భద్రతలో పాలుపంచుకోనున్నారు.
ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌లు ఓపెన్
లెక్కింపు ప్రక్రియలో భాగంగా సోమవారం ఉదయం 7 గంటలకు ఆయా అభ్యర్థులు లేదా వారి తరఫున వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు, అబ్జర్వర్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లను ఓపెన్ చేస్తారు. మొదటి రౌండ్‌లో 25 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి బాక్సులు ఓపెన్ చేస్తారు. వాటిలో ప్రతి 25 ఓట్లను బండిల్ కట్టి డ్రమ్ములో వేస్తారు. ఆ తర్వాత మళ్లీ స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి మరో 25 పోలింగ్ బూత్‌లకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి ఇస్తారు. అలా ఎనిమిదిసార్లు 200 పోలింగ్ బూత్‌లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను తెచ్చి బండిల్స్‌గా కడతారు. ఈ ప్రక్రియ అంతా గంటలో పూర్తవుతుంది.
చెల్లిన ఓట్లలో సగానికిపైగా వస్తేనే..
మొత్తం పోలైన ఓట్లలో ఎన్ని ఓట్లు చెల్లుబాటు అవుతాయో, ఆ చెల్లిన ఓట్లలో సగం ఓట్లకు మించి ఒక ఓటును కలిపి గెలుపు కోటాగా నిర్ణయిస్తారు. మొదటి రౌండ్‌లో పోలైన ఓట్లలో ఎవరికై తే సగానికి మించి ఒక ఓటు అధికంగా వస్తుందో వారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచినట్లుగా ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. ఒక వేళ మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా గెలుపు కోటా రాకపోతే రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించాల్సి ఉంటుంది. అంటే ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 24,139 పోల్ అయ్యాయి. అందులో సగానికి మించి 12,070 ఓట్లు సాధించిన అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలుస్తారు. ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్న 19 మంది అభ్యర్థుల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడ కోటా ఎవరికి రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు.
రెండో ప్రాధాన్యత ఓట్లతో ఎలిమినేషన్..
మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఏ అభ్యర్థి కూడా గెలువకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. 19 మంది అభ్యర్థుల్లో ఏ అభ్యర్థికి అతి తక్కువ ఓట్లు వస్తాయో, ఆ అభ్యర్థిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఏయే అభ్యర్థులకు వేశారో, వాటిని ఆయా అభ్యర్థులకు కలుపుతారు. అప్పటికి కూడా గెలుపుకు కోటా రాకపోతే ఆ తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరెవరికి వేశారో ఆయా అభ్యర్థులకు ఓ ఓట్లను కలుపుతారు. అప్పుడు మళ్లీ కోటా వచ్చిందా రాలేదా చూస్తారు. ఎవరికై నా గెలుపు కోటా వస్తే దాంతో గెలిచినట్లుగా భావిస్తారు. ఒక వేళ కోటా రాకపోతే అదే తరహాలో చివరి అభ్యర్థి వరకు తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తూ వస్తారు. అలా గెలుపు కోటా వచ్చేంత వరకు లెక్కిస్తుంటారు. కోటా రాకపోయినా ఎవరైతే ఎలిమినేట్ కాకుండా చివరి వరకు ఉంటారో ఆ అభ్యర్థినే విజేతగా ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఏ అభ్యర్థికీ గెలుపు కోటా రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తే మాత్రం కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అర్థరాత్రివరకు సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.
25 టేబుళ్లపై ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు
ఫ మధ్యాహ్నం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం
ఫ గెలుపునకు సరిపడా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ షురూ
ఫ ఆ తరువాత రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
ఫ సోమవారం అర్ధరాత్రి తర్వాత తేలనున్న ఫలితం
ఓట్ల లెక్కింపునకు సహకరించాలి
నల్లగొండ : వరంగల్– ఖమ్మం –నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సవ్యంగా జరిగేందుకు సహకరించాలని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. శనివారం ఆమె కలెక్టరేట్‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏర్పాటు చేయనున్న టేబుళ్లు, చెల్లుబాటు అయ్యే ఓట్లు, కానీ ఓట్ల గుర్తింపు తదితర అంశాలను వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పోటీ చేసే అభ్యర్థులు, ఏజెంట్లు పాల్గొన్నారు.
8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 25 టేబుళ్లలో ఒక్కో టేబుల్‌పై వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. ప్రతి టేబుల్ వద్ద పోటీలో ఉన్న 19 మంది అభ్యర్థులు చూసుకునేలా 19 గడీలు కలిగిన ర్యాక్‌ను ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉన్న అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లకు చూపిసూ్‌త్ ఆ బ్యాలెట్ పేపర్‌లో మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వేసారో ఆ అభ్యర్థికి సంబంధించిన గడిలో ఆ బ్యాలెట్ పేపర్‌ను వేస్తూ వెయ్యి ఓట్లను ఒక్కో టేబుల్‌పై లెక్కిస్తారు. ఒక వేళ ఓటు చెల్లకపోతే దాన్ని ఏజెంట్లందరికి చూపి పక్కన పెడతారు. అలా మొదటి రౌండ్ కౌంటింగ్ మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment