లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవం
విశ్వక్సేనుడికి తొలిపూజ, స్వస్తివాచనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
యాదగిరిగుట్ట : భక్తజనబాంధవుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాలకు మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వేదపండితులు శనివారం వైభవంగా శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు ప్రధానాలయంలోని మూలవర్యుల ఆజ్ఞ (అనుమతి)తో పూజలు ప్రారంభించి 10.15కు విశ్వక్సేన ఆరాధన, 10.50గంటలకు స్వస్తివాచన పూజలు చేసి ఉత్సవాలకు తెరలేపారు. విశ్వశాంతి, లోకకల్యాణార్థం నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను పాంచరాత్రాగమ శాస్త్రానుసారం ప్రధానాలయంలో ఈనెల 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
విశ్వక్సేనుడికి తొలిపూజ
దేవతల సర్వసేనానాయకుడు విశ్వక్సేనుడికి తొలి పూజతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో దివ్య మనోహరంగా అలంకరించిన ఉత్సవమూర్తులను గర్భాలయం ఎదుట ప్రత్యేకపీఠంపై అధిష్ఠింపజేశారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగడానికి నిర్దేశించిన మంత్రోచ్ఛరణలతో తొలిపూజా పర్వాలను నిర్వహించారు. ముల్లోకాలకు శుభం కలగాలని వేదమంత్రాలు పఠిస్తూ విశ్వక్సేనుడిని ఆరాధించారు.
స్వస్తిపుణ్యాహవాచనం, రక్షాబంధనం
విశ్వశాంతిని, లోకకల్యాణం కోసం, ప్రాణికోటి, ఇతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని భగవంతుడిని వేడుకొనుట స్వస్తిపుణ్యాహవాచనం పూజ విశిష్టత. స్వస్తివాచన మంత్ర జలాన్ని గర్భాలయం, ఉప ఆలయాలు, ముఖమండపం, ధ్వజస్తంభానికి, ఆలయ తిరుమాడ వీధులు, ఆలయ పరిసరాల్లో, భక్తులపై సంప్రోక్షణ గావించారు. అనంతరం లోకకల్యాణార్థం సమర్పించబడిన రక్షాబంధనాన్ని స్వీకరించే వేడుక నిర్వహించారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్టా బంగారు కవచమూర్తులు, ఉప ఆలయాల్లోని ఆండాళ్ అమ్మవారికి, ఆళ్వారులకు, విశ్వక్సేనుడికి, ముఖడపంలోని ఉత్సవమూర్తులకు రక్షాబంధనం చేశారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు, భక్తులకు రక్షాబంధనం కట్టారు.
శాస్త్రోక్తంగా మృత్సంగ్రహణం
సాయంత్రం నిత్య పూజల అనంతరం 6.30 గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోపణ వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేడుకల్లో ఆలయ ఈఓ భాస్కర్‌రావు, ధర్మకర్త నర్సింహమూర్తి, అర్చకులు, యజ్ఞాచార్యులు, పారాయణికులు పాల్గొన్నారు.
ఉత్సవాల్లో నేడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ఠ, 11గంటలకు ధ్వజారోహణ వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవన పూజలు ఉంటాయి.
లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవం
Comments
Please login to add a commentAdd a comment