కోదాడ: కోదాడ పట్టణ సమీపంలోని ఖానాపురానికి చెందిన ఓ వ్యక్తి పురిటినొప్పులతో బాధపడుతున్న తన భార్యను ఫిబ్రవరి 26 తెల్లవారుజామున కోదాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పట్టించుకోలేదని అతడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేరని, నర్సులు తన భార్యను పరీక్షించి కండీషన్ సీరియస్‌గా ఉందని సూర్యాపేటకు తీసుకెళ్లమని చెప్పారని, అంబులెన్స్ ఉన్నా కూడా ఏర్పాటు చేయలేదని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ దృష్టికి వెళ్లడంతో ఆయన కోదాడ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని శనివారం జిల్లా వైద్యాధికారిని ఆదేశించినట్లు తెలిసింది. ఇదే విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ దశరథనాయక్‌ను వివరణ కోరగా.. కోదాడ ఆస్పత్రిలో ముగ్గురు గైనకాలజిస్టులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం ఒక్కరే పనిచేస్తున్నారని, ఫిబ్రవరి 26న సదరు గర్భిణి ఆస్పత్రికి వచ్చిన సమయంలో ఆ వైద్యురాలు సెలవులో ఉండడంతో సిబ్బంది పరిశీలించి ఉమ్మ నీరు ఎక్కువగా ఉండడంతో సూర్యాపేటకు తీసుకెళ్లాలని సూచించారని పేర్కొన్నారు. సిబ్బంది, వైద్యుల కొరత లేకుండా చూడాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపామని పేర్కొన్నారు.
షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశం..?
Comments
Please login to add a commentAdd a comment