బావులు, బోర్లు వెలవెల.. ఎండుతున్న పంటలు | - | Sakshi
Sakshi News home page

బావులు, బోర్లు వెలవెల.. ఎండుతున్న పంటలు

Published Mon, Mar 3 2025 1:22 AM | Last Updated on Mon, Mar 3 2025 1:20 AM

బావుల

బావులు, బోర్లు వెలవెల.. ఎండుతున్న పంటలు

గుండాల : గుండాల మండలానికి గోదావరి జలాలు అందక రైతులు వేసిన వరి పంటలు ఎండిపోతున్నాయి. మండలంలో నవాబుపేట రిజర్వాయర్‌తో 32వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని ప్రభుత్వ ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యంతో సాగు నీరు రాక పంటలు ఎండిపోతున్నాయి. సాగు నీరు వస్తుందన్న ఆశతో రైతులు బోర్లు, బావుల కింద 1250 ఎకరాలు వరి సాగు చేశారు. ఎండలకు భూగర్భజలాలు అడుగంటిపోయి బావులు, బోర్లలో నీరు లేక వట్టిపోతున్నాయి. ఇప్పటికే సుమారు 200 ఎకరాలలో వరి ఎండిపోయినట్లు అధికారులు అంచనా వేశారు. దీంతో ఏం చేయాలో తోచక రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఉన్న 83 కుంటలు, చెరువులకు గోదావరి జలాలు వస్తే వేసిన పైర్లు పంటలు పండుతాయని ఆశతో ఎదురుచూసిన రైతాంగానికి నిరాశే మిగిలింది. ఇటీవల ప్రభుత్వం గోదావరి జలాలను బిక్కేరు వాగుకు విడుదల చేయడంతో అనంతారం, సుద్దాల, బ్రాహ్మణపల్లి, అంబాల, మోత్కూరు, వంగాల గ్రామాల రైతులకు ఊరట లభించింది. కానీ వెల్మజాల, సీతారాంపురం, మరిపడిగ, మాసాన్‌పల్లి, రామారం, గుండాల, నూనెగూడెం, తుర్కలశాపురం, పెద్దపడిశాల, వస్తాకొండూర్‌, బండకొత్తపల్లి గ్రామాలకు సాగు నీరు అందక రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నవి. దీంతో రైతాంగం సాగు నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. మండలంలో బిక్కేరు పరీవాహక ప్రాంతాలలో కళకళలాడుతుంటే మరోపక్క పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతాంగం పంటలను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా పాలకులు నవాబుపేట రిజర్వాయర్‌ ద్వారా గోదావరి జలాలను మండలానికి అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.

నవాబుపేట రిజర్వాయర్‌ ద్వారా గోదావరి జలాలు అందించాలని

కోరుతున్న రైతులు

వాటర్‌ ట్యాంకర్‌తో నీళ్లు పెడుతున్నా..

నాకున్న రెండెకరాలతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాను. ఎండలతో బావి, బోర్లలో నీరు తగ్గడంతో సుమారుగా 3 ఎకరాల పొలం ఎండుతుంది. దీంతో వాటర్‌ ట్యాంకర్‌కు నెలకు రూ.15వేలు చెల్లించి వ్యవసాయ బావుల వద్ద నీటిని పట్టి రోజుకు ఒక 30 గుంటల వరి పొలాన్ని తడుపుతున్నాను. ప్రభుత్వం గోదావరి జలాలు విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలి. గ్రామానికి చెందిన బోరు వద్ద వాటర్‌ ట్యాంకర్‌ను నింపుకునేందుకు వెళ్తే కొంతమంది రైతులు గొడవ చేస్తున్నారు. దీంతో పొలం ఎండిపోతున్నది. – తూనం నరేష్‌, రైతు, పాచిల్ల

No comments yet. Be the first to comment!
Add a comment
బావులు, బోర్లు వెలవెల.. ఎండుతున్న పంటలు1
1/2

బావులు, బోర్లు వెలవెల.. ఎండుతున్న పంటలు

బావులు, బోర్లు వెలవెల.. ఎండుతున్న పంటలు2
2/2

బావులు, బోర్లు వెలవెల.. ఎండుతున్న పంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement