ఎంజీయూలో స్టాఫ్ క్వార్టర్స్ ప్రారంభం
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో స్టాఫ్ కోసం నిర్మించిన క్వార్టర్స్‌ను వైస్ చాన్స్‌లర్ అల్తాఫ్ హుస్సేన్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంజీయూ సైతం ఐఐటీ తరహాలో రూపుదాల్చడానికి ఇదొక ముందడుగని అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అలువాల రవి, ఆకుల రవి, డా. శ్రీదేవి, కొప్పుల అంజిరెడ్డి, వై. ప్రశాంతి, ఉపేందర్‌రెడ్డి, మద్దిలేటి, ఇంజనీర్ శైలజ, అధ్యాపకులు పాల్గొన్నారు.
నల్లబెల్లం, పటిక పట్టివేత
మద్దిరాల: బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటికను ఆదివారం మద్దిరాల మండల కేంద్రంలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం మామిండ్లమడవ గ్రామానికి చెందిన షేక్ ఖాదర్, షేక్ మదారు అన్నదమ్ములు. వీరిద్దరు కలిసి 30క్వింటాళ్ల నల్లబెల్లం, 10 కిలోల పటికను బొలేరో వాహనంలో రాజు అనే డ్రైవర్ సహాయంతో ఏపీలోని చిత్తూరు నుంచి మామిండ్లమడవ గ్రామానికి తరలిస్తుండగా మద్దిరాల మండల కేంద్రంలో పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన నల్లబెల్లం, పటికతో పాటు బొలేరో వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
అడ్డగూడూరు : అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతిచెందింది. ఈ ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వయస్సు సుమారు 45 ఏళ్లు ఉంటుందని, ఆమె భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతురాలు మహారాష్ట్రకు చెందిన టీషర్ట్ ధరించి ఉందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆస్పత్రి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి కారమైన గుర్తుతెలియని వాహనం కోసం సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కుక్కల దాడి.. గొర్రెలు మృతి
తుంగతుర్తి: కుక్కల దాడి చేయడంతో పది గొర్రెలు మృతిచెందాయి. తుంగతుర్తి మండలం మంచతండాకు చెందిన లాకవత్ లాల్‌సింగ్ తన గొర్రెలను రోజుమాదిరిగానే శనివారం సాయంత్రం తన ఇంటి ఎదుట గల దొడ్డిలోకి గొర్రెలను తోలాడు. రాత్రి వేళ దొడ్డిలోకి కుక్కలు చొరబడి గొర్రెలపై దాడి చేయడంతో 10 గొర్రెలు మృతిచెందాయి. గొర్రెల విలువ రూ.లక్ష వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు.
ప్రైవేట్ బస్సులో ప్రసవం
చిట్యాల: చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఆదివారం తెల్లవారుజామున కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మృతిచెందారు. మృతుల కారు ట్రావెల్స్ బస్సును కిందకు వెళ్లగా.. ఆ బస్సు దాని ముందున్న కారును, ఆ కారు మరో ట్రావెల్స్ బస్సును ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్సులో హైదరాబాద్ నుంచి ఏపీకి గర్భిణి శశికళ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తోంది. ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న బస్సు కొద్దిసేపటి తర్వాత చిట్యాలకు చేరుకుంది. అదే సమయంలో శశికళకు పురిటి నొప్పులు రావటంతో తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కు ఫోన్ చేసినప్పటికీ రాలేదు. చిట్యాలలో ట్రాఫిక్ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు జలంధర్, శివ బస్సు వద్దకు చేరుకుని శశికళకు ధైర్యం చెబుతుండగా.. ఆమె బస్సులోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అక్కడకు అంబులెన్స్ చేరుకోగా.. వైద్య సిబ్బంది పరీక్షించి నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment