నేటి నుంచి అలంకార, వాహన సేవలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నుంచి అలంకార సేవలు, వాహన సేవలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. 7 రోజుల పాటు ఒక్కో అలంకారంలో ఒక్కో సేవపై స్వామివారు ఊరేగనున్నారు. సోమవారం ఉదయం మత్స్యావతార అలంకార సేవ, రాత్రి శేష వాహన సేవ, 4వ తేదీ ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ, 5వ తేదీ ఉదయం శ్రీకృష్ణాలంకార(మురళీకృష్ణుడు) సేవ, రాత్రి పొన్నవాహన సేవ, 6వ తేదీ ఉదయం గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి సింహ వాహన సేవ, 7వ తేదీ ఉదయం జగన్మోహిని అలంకార సేవ, రాత్రి అశ్వవాహన సేవలో స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం, 8వ తేదీ ఉదయం హనుమంత వాహనంపై శ్రీరామ అలంకార సేవ, రాత్రి గజవాహన సేవలో తిరుకల్యాణ మహోత్సవం, 9వ తేదీ ఉదయం గరుడ వాహనంపై శ్రీమహావిష్ణు అలంకార సేవతో అలంకార సేవలు ముగియనున్నాయి. అదే రోజు రాత్రి దివ్య విమాన రథోత్సవం ఉంటుంది.
బంగారు తాపడం చేసిన వాహనాలపై..
యాదగిరీశుడు తొలిసారిగా స్వర్ణ తాపడం చేసిన వాహన సేవలపై ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగనున్నారు. హైదరాబాద్‌కు చెందిన సాయి పావని కన్‌స్ట్రక్షన్స్ ఇండియా లిమిటెడ్, గార్లపాటి పెద్ద యాదయ్య, రామలింగేశ్వరి కుటుంబ సభ్యులు రూ.12లక్షలతో గరుడ, శేష వాహనాలకు బంగారు తాపడం చేయించారు. అంతేకాకుండా రూ.4లక్షలతో అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు నూతనంగా బర్మా టేకుతో సేవ పీటలను తీర్చిదిద్దారు. వీటి పైనే స్వర్ణ తాపడం చేసిన శేష, గరుడ వాహనంపై స్వామి వారు ఊరేగుతారు.
చివరి రెండు రోజులు ఇలా..
10వ తేదీన ఉదయం మహా పూర్ణాహుతి, విష్ణు పుష్కరిణిలో చక్రతీర్థం, సాయంత్రం శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను జరిపిస్తారు. 11వ తేదీ ఉదయం 10గంటలకు అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవం నిర్వహించి ఉత్సవాలను ముగిస్తారు.
తొలిసారి బంగారు తాపడం
చేసిన వాహనాలపై ఊరేగనున్న
యాదగిరీశుడు
నేటి నుంచి అలంకార, వాహన సేవలు
Comments
Please login to add a commentAdd a comment