స్కూటీని ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు
చివ్వెంల(సూర్యాపేట): అతి వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ స్టేజీ వద్ద ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన జూలకంజి అనిల్‌రెడ్డి(45) కుటుంబం కొద్ది సంవత్సరాల క్రితం సూర్యాపేటకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అనిల్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన తన మామ ముప్పాని తిరుమల్‌రెడ్డి దురాజ్‌పల్లి గ్రామ శివారులోని పెద్దగట్టు వద్ద పండుగ చేస్తుండగా అనిల్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిమ్మాపురం గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన తన స్నేహితుడుని తీసుకొచ్చేందుకు స్కూటీపై సూర్యాపేటకు వెళ్లి, అతడిని ఎక్కించుకుని తిమ్మాపురం వస్తుండగా మార్గమధ్యలో దురాజ్‌పల్లి గ్రామ స్టేజీ వద్ద కుక్క అడ్డురావడంతో కిందపడిపోయారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న లారీ అనిల్‌రెడ్డి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతని స్నేహితుడు వినయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆస్పర్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మహేశ్వర్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment