శ్రీపాల్‌కే గురువుల పట్టం | - | Sakshi
Sakshi News home page

శ్రీపాల్‌కే గురువుల పట్టం

Published Tue, Mar 4 2025 1:28 AM | Last Updated on Tue, Mar 4 2025 1:27 AM

శ్రీప

శ్రీపాల్‌కే గురువుల పట్టం

వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పింగిలి శ్రీపాల్‌రెడ్డి గెలుపు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ–టీఎస్‌ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో శ్రీపాల్‌రెడ్డి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు వచ్చాయి. అయితే నర్సిరెడ్డి ఎలిమినేట్‌ కాకముందు గెలుపు కోటా ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి కూడా లేకపోవడంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్‌ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో.. శ్రీపాల్‌రెడ్డికి వచ్చిన 2,870 రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపారు. దీంతో శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించారు.

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన

కౌంటింగ్‌ ప్రక్రియ

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ నల్లగొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో సోమవారం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. బండిల్స్‌ కట్టడం ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఆ తరువాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 3 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో అధికారులు మొత్తం చెల్లిన ఓట్లలో సగానికి మించి ఒక్క ఓటును గెలుపు కోటా ఓటుగా నిర్ణయించారు. మొత్తం 24,135 ఓట్లు పోల్‌ కాగా 494 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. దీంతో గెలుపు కోటాను 11,821గా నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్‌రెడ్డి అత్యధికంగా 6,035 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాకు సరిపడా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించారు. చివరకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు.

రౌండ్‌ రౌండ్‌కు ఉత్కంఠే..

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. 15వ రౌండ్‌ నుంచి ఉత్కంఠ మరింతగా పెరిగింది. శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నా ద్వితీయ స్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డికి చేరువలో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి రాగలిగినా సుందర్‌రాజు ఎలిమినేషన్‌తో ఇద్దరి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఆ తరువాత పులి సరోత్తంరెడ్డి, పూల రవీందర్‌, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డిని ఎలిమినేట్‌ చేసి ఓట్లు లెక్కించారు. అప్పటికి కూడా గెలుపు కోటా రాకపోవడంతో చివరకు అలుగుబెల్లి నర్సిరెడ్డిని కూడా ఎలిమినేషన్‌ చేసి ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత కోటా రాకున్నా శ్రీపాల్‌రెడ్డిని గెలిచినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఎలిమినేషన్‌లో ఓట్లు పెరిగాయి ఇలా...

మొదటి ప్రాధాన్యతలో ప్రధాన అభ్యర్థులైన పింగలి శ్రీపాల్‌రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డికి 4,437 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పూల రవీందర్‌కు 3,115, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289 , సుందర్‌రాజుకు 2,040 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్‌ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఇలా 14వ రౌండ్‌ వరకు ఎలిమినేషన్‌ చేస్తూ ఓట్ల లెక్కింపు చేయగా శ్రీపాల్‌రెడ్డికి అప్పటి వరకు 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు వచ్చాయి. హర్షవర్ధన్‌రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్‌కు 3,249 ఓట్లు వచ్చాయి. అంటే.. 14వ రౌండ్‌వరకు ఎలిమినేట్‌ అయిన అభ్యర్థుల నుంచి మరో 130 రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి లభించాయి. ఈ రౌండ్‌ తరువాత సుందర్‌రాజును ఎలిమినేట్‌ చేసి ఓట్లు లెక్కింపు చేపట్టారు.

● 15వ రౌండ్‌లో శ్రీపాల్‌రెడ్డికి కూడా ఒక్కసారే 781 ఓట్లు పెరిగాయి. దీంతో ఆయన ఓట్లు 6,916కి చేరుకున్నాయి. రెండోస్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా 5,205 ఓట్లకు చేరుకున్నారు. హర్షవర్ధన్‌రెడ్డి 4,799 ఓట్లకు చేరుకోగా, పూల రవీందర్‌ 3,617 ఓట్లకు, సరోత్తంరెడ్డి 2,645 ఓట్లకు చేరుకున్నారు. ఈ రౌండ్‌లో అయిదుగురికి ఓట్లు పెరిగినప్పటికీ శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ఆయన దరిదాపుల్లో మిగతా అభ్యర్థులు ఎవరూ లేరు.

● పులి సరోత్తంరెడ్డి ఎలిమినేషన్‌ తరువాత చేపట్టిన 16వ రౌండ్‌లోనూ శ్రీపాల్‌రెడ్డికి అదే స్థాయిలో ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్‌లో 757 ఓట్లు పెరిగాయి. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి, 5,660 ఓట్లకు చేరుకోగా, హర్షవర్ధన్‌రెడ్డి 5,309 ఓట్లకు, పూల రవీందర్‌రెడ్డి 3,992 ఓట్లకు చేరుకున్నారు.

● పూల రవీందర్‌ ఎలిమినేషన్‌ తరువాత 17వ రౌండ్‌లో శ్రీపాల్‌రెడ్డికి 1348 ఓట్లు పెరిగి, 9021 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 6,448 ఓట్లకి చేరుకోగా, మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డి 6,034 ఓట్లకు చేరుకున్నారు. .

● హర్షవర్ధన్‌రెడ్డి ఎలిమినేషన్‌ తరువాత 18వ రౌండ్‌లో శ్రీపాల్‌రెడ్డికి 2,078 ఓట్లు పెరిగి, 11,099 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 8,448 ఓట్లకు చేరుకున్నారు. బరిలో శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి మాత్రమే మిగిలారు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్‌ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్‌ రెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇందులో వచ్చిన 2,870 ఓట్లు కలుపుకొని శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించి గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ప్రకటించారు.

ఫ రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం

ఫ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీ

ఫ ప్రధాన అభ్యర్థుల ఎలిమినేషన్‌ సమయంలో పెరిగిన ఉత్కంఠ

కౌంటింగ్‌ సాగింది ఇలా..

నల్లగొండ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రకియ నల్లగొండలోని ఆర్జాలబావి గోదాముల్లో సోమవారం పూర్తయింది.

ఉదయం 7 గంటలకు పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లను ఓపెన్‌ చేసి బ్యాలెట్‌ బాక్సులను కౌంటింగ్‌ హాల్‌కు తీసుకొచ్చారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి 25 చొప్పున బ్యాలెట్‌ బాక్సులను 8 రౌండ్లలో కౌంటింగ్‌ హాల్‌కు తీసుకొచ్చారు. 25 టేబుళ్లపై కౌంటింగ్‌ నిర్వహించారు.

కౌంటింగ్‌ హాల్‌లో బ్యాలెట్‌ బాక్సులను ఓపెన్‌ చేసి 25 బ్యాలెట్‌ పేపర్లను కట్టలు కట్టారు. ఈ ప్రక్రియ ఉదయం 11 గంటల వరకు కొనసాగింది.

ఆ తర్వాత కట్టలన్నింటినీ డ్రమ్ములో వేసి కలిపారు.

ఉదయం 11.30 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై.. సాయంత్రం 3 గంటలకు పూర్తయింది.

మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ కూడా గెలుపు కోటా రాలేదు.

సాయంత్రం 4 గంటలకు ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపట్టారు. రాత్రి 11 గంటలకు నర్సిరెడ్డి ఎలిమినేషన్‌తో పూర్తయింది.

రాత్రి 11 గంటలకు శ్రీపాల్‌రెడ్డికి ధ్రువీకరణ పత్రం అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
శ్రీపాల్‌కే గురువుల పట్టం1
1/3

శ్రీపాల్‌కే గురువుల పట్టం

శ్రీపాల్‌కే గురువుల పట్టం2
2/3

శ్రీపాల్‌కే గురువుల పట్టం

శ్రీపాల్‌కే గురువుల పట్టం3
3/3

శ్రీపాల్‌కే గురువుల పట్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement