ఓటరునాడి పట్టలే..! | - | Sakshi
Sakshi News home page

ఓటరునాడి పట్టలే..!

Published Wed, Mar 5 2025 2:07 AM | Last Updated on Wed, Mar 5 2025 2:06 AM

ఓటరునాడి పట్టలే..!

ఓటరునాడి పట్టలే..!

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్‌–ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ– టీఎస్‌ అభ్యర్థి పింగిలి శ్రీపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందగా, టీఎస్‌ యూటీఎఫ్‌ తమ సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయింది. సంఘం పోరాట పటిమ తమ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిని గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నా.. అనుకూల ఫలితాన్ని సాధించలేకపోయింది. ఇక పీఆర్‌టీయూ–టీఎస్‌ గతంలో కోల్పోయిన తమ స్థానాన్ని ఈసారి దక్కించుకోగలిగింది. ఉపాధ్యాయుల్లో పెద్ద సంఘంగా పేర్కొనే పీఆర్‌టీయూ ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి పింగిలి శ్రీపాల్‌రెడ్డిని గెలిపించుకొని తమ పాత స్థానాన్ని పదిలం చేసుకోగలిగింది. సొంత నియోజకవర్గం కాకపోయినా ఈ ఎన్నికల్లో బరిలో దిగిన కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి గట్టిగా పోరాడి ఓడారు. బీసీ నినాదంతో ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన పూల రవీందర్‌ ఆశించిన ఫలితం రాబట్టలేకపోయారు. ఇక, బీజేపీ అనుకున్నంత స్థాయిలో తమ బలాన్ని టీచర్లలో పెంచుకోలేకపోయింది. దీంతో ఆ పార్టీ తరఫున బరిలో దిగిన పులి సరోత్తంరెడ్డికి ఆశాభంగం తప్పలేదు.

ఎక్కడ పొరపాటు జరిగింది..

ఈ ఎన్నికల్లో టీఎస్‌ యూటీఎఫ్‌ రెండో స్థానానికి పడిపోవడంపై ఆ యూనియన్‌ ఆలోచనల్లో పడింది. గెలుస్తామని ధీమాతో ఉన్నా అంచనాలు ఎక్కడ తారుమారయ్యాయి.. ఓటమికి కారణాలేంటనే విశ్లేషణ చేసుకుంటోంది. 2019 ఎన్నికలో గెలుపొందిన తాము ఈసారి ఎందుకు ఓడిపోయామనే చర్చ యూటీఎఫ్‌ వర్గాల్లో జోరుగా సాగుతోంది. యూనియన్‌కు ఉన్న సంప్రదాయ ఓట్లు అలాగే ఉన్నాయని, అవి తమ అభ్యర్థికే పడ్డాయని, అయితే తటస్థంగా ఉండే టీచర్ల ఓట్లు మాత్రం హర్షవర్దన్‌రెడ్డికి వేశారని అంచనా వేస్తోంది. హర్షవర్ధన్‌ పోటీలో ఉండటం వల్లే తమకు రావాల్సిన ఓట్లకు గండిపడి, రెండోస్థానానికి పడిపోవాల్సి వచ్చిందని భావిస్తోంది. డబ్బు, మద్యం పంపిణీ ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో పని చేసిందన్న విశ్లేషణ యూటీఎఫ్‌ వర్గాల్లో సాగుతోంది.

ఇద్దరికి ప్రచారం చేయడమే దెబ్బకొట్టిందా?

ఈ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ అనుకున్న మేర ప్రభావం చూపలేకపోయారు. బీసీ వాదంతో, బీసీ సంఘాల మద్దతులో బరిలోకి దిగినా, అది పూర్తిగా ఫలించ లేదు. ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ఒకే ఎన్నికలో ఇద్దరు బీసీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని చెప్పడం మైనస్‌గా మారిందనే చర్చ సాగుతోంది. ఎవరో ఒకరిని గెలిపించాలని కోరితే ఆ ఒక్కరికి ఓట్లు పడేవని, రవీందర్‌తోపాటు సుందర్‌రాజుకు ఓట్లు వేయాలని సూచించడంతో బీసీ ఓట్లు చీలిపోయాయన్న చర్చ సాగుతోంది.

ఫ సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయిన టీఎస్‌ యూటీఎఫ్‌

ఫ పాత స్థానాన్ని దక్కించుకున్న పీఆర్‌టీయూ–టీఎస్‌

ఫ సొంత నియోజకవర్గం కాకున్నా గట్టి పోటీ ఇచ్చిన హర్షవర్ధన్‌ రెడ్డి

ఫ టీచర్లలో బలాన్ని పెంచుకోలేకపోయిన బీజేపీ

గట్టి పోటీ ఇచ్చిన హర్షవర్ధన్‌రెడ్డి..

ఉపాధ్యాయ ఎన్నికల్లో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి టీచర్స్‌ జేఏసీలోని సంఘాల మద్దతులో బరిలో దిగి చివరి వరకు పోరాడారు. ఓడిపోయినా.. గణనీయమైన ఓట్ల సాధించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరాక సీఎం రేవంత్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం వల్ల పండిట్‌, పీఈటీ పదోన్నతులు, ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు ఇప్పించడం వంటి విధాన నిర్ణయాల్లో హర్షవర్ధన్‌రెడ్డి కీలక ప్రాత పోషించిన అంశం టీచర్లలోకి బలంగానే వెళ్లింది. హర్షవర్ధన్‌ స్థానికేతరుడనే ప్రత్యర్థుల ప్రచారం కూడా ఆయనకు ప్రతికూలంగా మారింది. అయినప్పటికీ యూటీఎఫ్‌ అభ్యర్థి నర్సిరెడ్డికి, హర్షవర్ధన్‌ మధ్య వ్యత్యాసం 500లోపు ఓట్లు మాత్రమే ఉండడం గమనార్హం. పూల రవీందర్‌ ఎలిమినేట్‌ కావడానికి ముందు 16వ రౌండ్‌ ముగిసే వరకు నర్సిరెడ్డికి 5,660 ఓట్లు ఉండగా, హర్షవర్ధన్‌రెడ్డికి 5,309, శ్రీపాల్‌రెడ్డికి 7,673 ఓట్లు ఉన్నాయి. నర్సిరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి మధ్య వ్యత్యాసం 351 ఓట్లే. రవీందర్‌ ఎలిమినేషన్‌ తరువాత కూడా అదే పరిస్థితి కొనసాగింది. దీంతో హర్షవర్ధన్‌రెడ్డి మూడో స్థానానికి వెళ్లాల్సి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement