134 మంది కార్యదర్శులకు చార్జి మెమోలు
నల్లగొండ: పంచాయతీ కార్యదర్శులకు సర్వీస్ బ్రేక్ తప్పేలా కనిపించడం లేదు. జిల్లాలో పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆ శాఖకు చెందిన జిల్లా అధికారి అనుమతి లేకుండా సెలవుపై వెళ్లారు. గతంలోనే 109 మందికి నోటీసులు జారీ చేసిన పంచాయతీ అధికారి తాజాగా 134 మందికి చార్జి మెమోలు అందజేశారు.
అనుమతి లేకుండా నెలల తరబడి..
చార్జి మెమోలు అందుకున్న వారిలో కొందరు మూడు నెలలు, మరికొందరు ఆరు నెలలు, ఇంకొందరు సంవత్సరంన్నర వరకు ఎలాంటి అనుమతి లేకుండా సెలవులపై వెళ్లారు. వారంతా వివిధ రకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వెళ్లారు. తిరిగి విదుల్లో జాయిన్ అయ్యేందుకు రాగా చాలా రోజులు వారిని పెండింగ్‌లో ఉంచారు. అనుమతి లేకుండా వెళ్లినందుకు వారి సెలవుల సర్వీస్ కాలాన్ని కట్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి వారందర్ని గతంలో పనిచేసిన ప్రాంతాల నుంచి 109 మందిని బదిలీ చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శులంతా కలెక్టర్‌ను కలిసి మొర పెట్టుకున్నారు. వీరిని వాస్తవంగా సస్పెండ్ చేయాలి కానీ, మానవతా దృక్పథంతో సెలవు కాలానికి సంబంధించిన సర్వీస్‌ను రద్దు చేసి వేతనాన్ని కట్ చేసేలా ఉత్తర్వులు జారీ చేసి విధుల్లోకి తీసుకున్నారు. అప్పట్లో వారందరికీ నోటీసులు కూడా ఇచ్చారు. తాజాగా చార్జి మెమోలు అందుకున్న వారందరినీ త్వరలో విచారించేదుకు ఆర్డీఓ, ఎంపీడీఓ స్థాయి అధికారులను ఒకరిని నియమించునున్నట్టు తెలిసింది. కార్యదర్శులు నిజంగా ఎలాంటి అనుమతి లేకుండా సెలవులపై నెలల తరబడి వెళ్లారని రుజువైతే వారు విధులకు గైర్హాజరైన కాలానికి సంబంధించి సర్వీస్ వేతనాన్ని కట్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
ఫ చెప్పకుండా సెలవులపై వెళ్లినందుకు జారీచేసిన డీపీఓ
ఫ గతంలోనే 109 మందికి షోకాజ్ నోటీసులు, బదిలీ
ఫ గైర్హాజరీల వ్యవహారంపై త్వరలోనే విచారించనున్నట్లు సమాచారం
రుజువైతే సెలవు కాలం సర్వీస్ రద్దే..
ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైననట్లు విచారణలో తేలితే ఆ కాలానికి సంబంధించి కార్యదర్శులకు సర్వీస్ బ్రేక్ చేస్తాం. దీంతోపాటు వారికి వేతనం కట్ కానుంది. త్వరలోనే విచారణ అధికారిని నియమిస్తాం.
– వెంకయ్య, డీపీఓ, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment